Apr 25,2023 22:14

మాట్లాడుతున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

          ప్రజాశక్తి-నార్పల   ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పిలుపునిచ్చారు. ఈమేరకు మండల కేంద్రంలో సిఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. ఇందులో భాగంగా సభ వేదిక వద్ద విలేకరులతో మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జగనన్న నార్పలకు వస్తున్నట్లు తెలిపారు. కావున జగనన్న రాకను ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పి ఆహ్వానించాలని కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో శింగనమల నియోజకవర్గం ముందంజలో ఉందన్నారు. ఈవిషయాన్ని మనం జగనన్నకు చెప్పాలన్నారు. అందుకోసం నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామానికీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా ప్రతి ఒక్కరికీ మజ్జిగ, స్నాక్స్‌, మంచి నీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు సభా ప్రాంగణానికి వచ్చేలా జనం ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. జగనన్నే మన భవిష్యత్తు 'జగనన్నే మా నమ్మకం' అనే నినాదంతో సభ మార్మోగాలన్నారు. ఈ.కార్యక్రమంలో మంత్రి ఉషశ్రీచరణ్‌, ఎంపి తలారి రంగయ్య, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, వైసిపి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు రాజారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.