ప్రజాశక్తి- వికోట: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాయకత్వానికి జనామోదం మెండుగా ఉందని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని బోడిగుట్లపల్లి పంచాయితీ పరిధిలో విస్తతంగా పర్యటించారు. ఎర్రంపల్లిదొడ్డి పల్లి గ్రామాల పరిధిలోని ప్రతి గడపకు వారు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అని క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. ప్రజా సౌకర్యార్థం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వాలంటరీ వ్యవస్థ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా అర్హతే ప్రామాణికంగా సచివాలయంలో పరిష్కరించు కోవాలని సూచించారు. గత ఎన్నికల్లో ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని ఎల్లవేళలా ప్రజాసేవకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఇదే అభిమానాన్ని రాబోవు ఎన్నికల్లో మరోసారి చూపి జగనన్న నాయకత్వానికి సంపూర్ణ మద్దతు పలకాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ఎర్రంపల్లి గ్రామంలో 250 మీటర్ల సీసీ రోడ్డు మంజూరు చేసి పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వీరివెంట ఎంపీపీ యువరాజ్, మండలపార్టీ అధ్యక్షుడు బాల గురునాథ్, వైస్ ఎంపీపీ తమీం ఖాన్ లక్ష్మణ్‌రెడ్డి ఎంపీటీసీ మంజునాథ్, ఎంపీడీఓ బాలాజీతో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










