జగనన్న కాలనీ కోసం బలవంతపు భూసేకరణ ఆపాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు
ప్రజాశక్తి- పలమనేరు:
పలమనేరు రూరల్ మండలం మొరం రెవెన్యూపరిధిలో జగనన్నకాలనీ కోసం రామచంద్రయ్య భూమిని రెవెన్యూ అధికారులు బలవంతంగా తీసుకోవడం జరిగింది, ఆ భూమిని శుక్రవారం సిపిఎం నాయకులు సందర్శించారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ పలమనేరు మండలం మొరం రెవెన్యూ పరిధిలో జగనన్న కాలనీ కోసం బలవంతంగా సేకరించిన సర్వే నెంబర్ 723/4 నందు విస్తీర్ణం మూడు ఎకరాల 16సెంట్ల భూమి తిరిగి వికలాంగుడైన రామచంద్రయ్యకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం రామచంద్రయ్య వద్ద నుంచి ఎంత భూమి సేకరించారో అంత భూమి మరొకచోట చూపించాలన్నారు. లేదా ఆ భూమికి నష్టపరిహారం కట్టించాలని కోరారు. అధికారులు అలా చేయని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఏ మండలంలో చూసినా జగనన్నకాలనీ పేరుతో పేదలు సాగు చేసుకుంటున్న భూమిని బలవంతంగా లాక్కోవడం దారుణమన్నారు. పలమనేరు నియోజకపరిధిలో అదేవిధంగా బైరెడ్డిపల్లి మండలం చిన్నచల్లారిగుట్ట ఆకులకొత్తూరు గ్రామంలోను జగనన్నకాలనీ కోసం బలవంతంగా దళితుడైన ఎల్లప్ప, వికలాంగుడైన లక్ష్మయ్య భూములను తీసుకోవడం చూస్తుంటే ప్రభుత్వం దళితుల ఆర్థికపతనాన్ని కోరుకుంటోందని తెలుస్తోందని ఆరోపించారు. జిల్లాలో ఎక్కడెక్కడ పేదల దగ్గర భూములు తీసుకున్నారో వారందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని అన్నారు. అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం ఉల్లంఘించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని 2013 భూసేకరణ చట్టాన్ని పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఓబుల్ రాజు, పట్టణ కార్యదర్శి గిరిధర్ గుప్త, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ పాల్గొన్నారు.










