జగనన్న ఇళ్లు పూర్తి అయినా.. అందని బిల్లులు..
ఏళ్ల తరబడి నిరీక్షణ
ప్రాధేయపడిన ఫలితం శూన్యం
ప్రతి బిల్లుకు రూ.2వేలు తప్పనిసరి
ప్రజాశక్తి- గంగవరం
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికీ నీడ కల్పించేలా జగనన్న గహాలు పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే సంబంధిత అధికారులు ఆపథకాన్ని నీరుగార్చుతున్నారు. ఇంటి పనులు పూర్తిచేసినా వారికి బిల్లులు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ వారు విసుగు చెంది విధులేని పరిస్థితిలో మౌనం వహించాల్సిన దుస్థితి మండలంలో నెలకొంది.
మండలం మేలుమాయి పంచాయతీ గుండ్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం భార్య పార్వతమ్మపేరు మీద సంవత్సరంకు ముందు జగనన్న ఇల్లు మంజూరైనట్లు ధృవప్రతం ఇవ్వడంతో పాటు భూమి కూడా చూపించారు. అంతేకాకుండా ఆ స్థలంలో ఇల్లు కట్టుకోమని అధికారులు ఆదేశాలిచ్చారు. పార్వతమ్మ, ఆమె భర్త కలిసి ప్రతిరోజు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తూ ప్రభుత్వం తమకు నీడ కల్పిస్తుందని ఎంతో ఆశతో ఇంటి పని మొదలుపెట్టి పునాదులు వేశారు. దీనికి సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని అధికారులను అడిగితే రెండు రోజులవుతుందని, వారంలో వస్తుందని, మీరు పనులు పూర్తి చేయండని హామీ ఇచ్చారు. దీంతో వారు బిల్లులు అందకపోయినా అప్పులు చేసి మరీ ఇంటి పని పూర్తి చేశారు. మళ్లీ తమకు అందాల్సిన బిల్లులు అందంచాలని ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరిగి సంబంధిత అధికారిని నిలదీయగా మీ ఇంటి మంజూరుపత్రం బ్లాక్ లిస్టులో పడిపోయిందని, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఇంటి బిల్లు రావని తేచ్చి చెప్పేశారు. దీంతో భారతమ్మకు దిక్కుతోచని పరిస్థితి పడింది. రోజూ కూలి పనులలో వచ్చిన డబ్బుతో పాటు అప్పుచేసి ఇంటిపని పూర్తి చేశామని, ఇప్పుడు వచ్చే బిల్లుతో అయినా అప్పుటు తీర్చుదామనుకుంటే ఇల్లే మంజూరు కాలేదని అంటున్నారని ఇక తమకు ఆత్మహత్య శరణమని కన్నీటిపర్యంతమర్నారు. ఇదిలా ఉండగా కొందరు అధికారులు జగనన్న ఇల్లు లబ్ధిదారుల వద్ద ప్రతి బిల్లుకు రూ.2వేలు చొప్పున డబ్బులు చెల్లిస్తే గానీ బిల్లులు ఇవ్వడం లేదని, ఈవిషయం ఎవరికైనా చెబితే పూర్తిగా ఇల్లు క్యాన్సిల్ చేస్తామని బెదిరించడంతో విధిలేని పరిస్థితుల్లో అధికారులకు డబ్బులు చెల్లించి బిల్లులు చేసుకుంటున్నామని లబ్ధిదారులు అంటున్నారు. ఇకనైనా తమకు బిల్లులు మంజూరు అయ్యేలా సహాయం చేయాలని లబ్ధిదారులు పై అధికారులను వేడుకుంటున్నారు.










