ప్రజాశక్తి-నెల్లూరు :పేద బడుగు బలహీన వర్గాల అభివధ్ధి,సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కషి చేస్తూ పేదల పక్ష పాతి గా నిలిచారని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుండి గురువారం జగనన్న చేదోడు పథకం క్రింద లబ్ధిదారుల ఖాతాలలో బటన్ నొక్కి నగదు జమ చేశారు. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ తిక్కన ప్రాంగణం నుండి కలెక్టర్ ఎం .హరి నారాయణన్ ,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అరుణమ్మ, మేయర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లకు మెగా చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ పాదయాత్ర లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కుల, మత ,వర్గాలకు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారు. సమాజానికి వెన్నెముక అయిన బీసీలు మిగిలిన వారితో సమానంగా ఎదగాలనిసిఎం జగనన్న చేదోడు పథకం ద్వారా ఆర్థిక సహాయంగా అందజేస్తున్నారన్నారు. ఏడాదికి రూ.10,000 చొప్పున గత 4 సంవత్సరాలలో లక్షలాది మంది రజకులు , నాయి బ్రాహ్మణులు, టైలర్లకు 1252 కోట్లు లబ్ధి చేకూర్చారన్నారు. కలెక్టర్ ఎం.హరి నారాయణన్ మాట్లాడుతూ జిల్లాలో 18090 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున రూ 18.09 కోట్లు ముఖ్యమంత్రి వారి ఖాతాల్లో జమ చేశారన్నారు. వత్తి చేసుకునే పేద వర్గాల వారు వడ్డీల బారిన పడకుండా ప్రభుత్వం ఇస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నాలుగు విడతల్లో మొత్తం రూ. 69.18 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగనన్న చేదోడు పథకం అమలు చేస్తుంది. ఈ పథకంలో జిల్లాకు మొదటి విడత లో రూ .16.57 కోట్లు, 2 వ విడతలో రూ .16.01 కోట్లు, 3 వ విడతలో రూ.18.52 కోట్లు , 4 వ విడత లో రూ .18.09 కోట్లు మొత్తం నాలుగు విడతల్లో రూ .69.18 కోట్లు లబ్దిదారులకు ప్రభుత్వం అందజేసింది.ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జంగం కార్పొరేషన్ చైర్ పర్సన్ ప్రసన్న, సంచార జాతుల చైర్ పర్సన్ ఆసిఫా, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్మలాదేవి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటయ్య పాల్గొన్నారు.










