జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభ0
ప్రజాశక్తి-అనంతసాగరం : అనంతసాగరం సచివాలయం -2లో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఎంపిపి సంపూర్ణమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలకు రక్షణ కవచం లాంటిదన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆత్మకూరు ఆర్‌డిఒ కరుణ కుమారి ఆకస్మికంగా సందర్శించారు. నడవలేని వారికి, అత్యవసర కేసులో ఉంటే వీల్‌చైర్, ఫ్యాన్ సౌకర్యం, డాక్టర్ల వద్ద టేబుల్ సదుపాయాలు లేకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఊపిరితిత్తులు, గుండె, మహిళలకు ప్రత్యేక స్పెషలిస్టు మహిళా డాక్టర్లు, కంటి పరీక్షలు, బిపి, సుగర్ పలు రకాలు వైద్యపరీక్షలు నిర్వహించామన్నారు. వైద్య పరీక్షలు అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని సచివాలయాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఆరోగ్య సురక్ష పథకంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో మండల సచివాలయాల కన్వీనర్ అంకిరెడ్డి, గ్రామ సర్పంచ్ కమతం శోభ, మండల వైద్యాధికారిణి డాక్టర్ వరలక్ష్మి, వైద్య, ఐసిడిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










