ప్రజాశక్తి - ఉండి
విద్యార్థులను మరింత ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని ప్రారంభించారని డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. గురువారం ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల విద్యా శాఖ అధికారి ఎ.రవీంద్ర అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పివిఎల్ నరసింహరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను మరింత వెలికితీసి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మొదటి ముగ్గురు విద్యార్థులకు, ఇంటర్‌లో ప్రతిభ చూపించిన మొదటి ముగ్గురు విద్యార్థులకు నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. విద్యార్థులకు చదువు భారం కాకూడదని ఇప్పటికే పలు కార్యక్రమాలను రూపొందించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సరికొత్తగా ఆణిముత్యాలు కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతిస్తోందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, కాళ్ల జెడ్‌పిటిసి పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, ఉండి సర్పంచి కమతం సౌజన్య బెనర్జీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










