జగన్మోహనుడు వచ్చేను.. వరాలు తెచ్చేను..!
నేడు కుప్పంలో చేయూత నగదు జమ
రానున్న ముఖ్యమంత్రి జగన్
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
జిల్లాల విభజన అనంతరం తొలిసారి ముఖ్యమంత్రి కుప్పం వస్తున్నారు. ఈ మేరకు జిల్లా వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వరాలు కురిపిస్తారని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. అలాగే రాజకీయంగానూ నేటి కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే ఈ ప్రాంతంలో గొడవలు జరిగాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రానుండడంతో రాజకీయంగా చర్చ సాగుతోంది.
సిఎంపై గంపెడు ఆశలు
జిల్లాల విభజన తరువాత మొదటిసారి వస్తుండడంతో ముఖ్యమంత్రిపై అందరిలోనూ ఆసక్తి నెలకుంది. అభివృద్ధి మొత్తం తిరుపతితో పాటు వెళ్లిపోయింది. పాత జిల్లా అయినప్పటికీ ఇక్కడ అభివృద్ధి జాడ మాత్రం కనిపించడం లేదు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో యూనివర్శిటీ ప్రకటించాల్సి ఉంది. అలాగే హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చే కాలువ నిర్మాణ పనులు కుప్పం వరకు వచ్చి ఆగిపోయాయి. దీనిపై ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. అలాగే కుప్పం మున్సిపాలిటీ చేశారు గానీ నిధులు మాత్రం లేకుండా పోయాయి. దీంతో కాలువల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారం కావాల్సి ఉంది. అలాగే కుప్పంలో ఉపాధి అవకాశాలు లేక వేలమంది బెంగుళూరుకు పొట్ట చేతపట్టుకుని వలసలు పోతుంటారు. వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అలాగే కుప్పంలోని ద్రవిడ యూనివర్శిటీలో ఇటీవల రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడున్న విసి పనితీరుపై చంద్రబాబు వద్ద అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులే చంద్రబాబు వద్ద ఫిర్యాదు చేశారు. అలాగే ఇక్కడ జరుగుతున్న క్వారీపైనా దుమారం రేగుతోంది. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి.
చేయూత ప్రారంభం..
కుప్పం వేదికగా నిర్వహించనున్న వైఎస్‌ఆర్ చేయూత మూడో విడత నగదు జమ రాష్ట్రస్థాయి కార్యక్రమ నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హెలిప్యాడ్‌ను సిద్ధం చేశాం. అనిమిగానిపల్లి వద్ద బహిరంగ సభ వద్ద బహిరంగ సభ జరగనుంది. వైఎస్‌ఆర్ చేయూత లబ్ధిదారులు, ప్రజలు బహిరంగ సభకు రానుండడంతో పటిష్టంగా గ్యాలరీల నిర్వహణ, తాగునీటి సదుపాయం తదితర ఏర్పాట్లు చేశారు. కుప్పం చెరువు వద్ద పటిష్ట భధ్రతా ఏర్పాట్లు నిర్వహించారు.










