Jun 28,2023 21:55

రాయదుర్గంలో నిర్వహించిన బస్సుయాత్ర బహిరంగ సభలో పాల్గొన్న టిడిపి నాయకులు

       రాయదుర్గం : రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదాయం అంతకంతకూ పెరగ్గా, జనం నెత్తిన మాత్రం అప్పుల భారం పడిందని టిడిపి నాయకులు విమర్శించారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర బుధవారం నాడు రాయదుర్గంలో కొనసాగింది. టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు బికె.పార్థసారధి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, మాజీమంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుంచి వినాయక కూడలి వరకు టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్‌ సర్కిల్లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. ఎప్రికల్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు జరిపిన అనంతరం మల్లాపురం లేఅవుట్‌ వద్ద గల టిడ్కో ఇళ్లను పరిశీలించారు. టిడ్కో గృహాల వద్ద సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం వినాయక కూడలిలో జరిగిన బహిరంగ సభలో పార్టీ నాయకులు ప్రసంగించారు. వైసిపి ఒక్క ఛాన్స్‌ పేరుతో అధికారం చేపట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలుజేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్మోహన్‌రెడ్డి కుటుంబం బాగుపడింది గానీ, ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. సొంత తల్లీ, చెల్లిని చూడలేని వ్యక్తి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఏం చూస్తాడని నిలదీశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. ఈ పాలన మళ్లీ రావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే పాలన లభిస్తుందని చెప్పారు. రాయదుర్గం కోటపై తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం మాజీ శాసనసభ్యులు హనుమంతరాయ చౌదరి, శాసనమండలి సభ్యులు బిటి.నాయుడు, మాజీ శాసన మండలి సభ్యులు గుండుమల తిప్పేస్వామి, పార్టీ నాయకులు కోట్ల సుజాతమ్మ, అనంతపురం మాజీ మేయర్‌ మదమంచి స్వరూప, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్‌ఛార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు, శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీధర్‌ చౌదరితో పాటు రాయదుర్గం నియోజకవర్గంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.