
* టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్
ప్రజాశక్తి - ఆమదాలవలస: రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగనాసురునికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ కళ్లు తెరిపిద్దాం పేరిట కళ్లకు గంతలు కట్టుకుని నిజం గెలవాలని నినాదాలు చేస్తూ పట్టణంలోని ఒన్‌వే సెంటర్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.లక్షల కోట్లు దిగమింగినట్లు ఆధారాలతో సహా నిరూపణ అయి 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి, అందరినీ తనలాగే చిత్రీకరించాలన్న దురుద్దేశంతో చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబును జైల్లో పెట్టి 50 రోజులైనా ఒక్క ఛార్జిషీట్‌నైనా ఫైల్ చేశారా అని ప్రశ్నించారు. మొదట రూ.మూడు వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని, తర్వాత రూ.271 కోట్లు, ఆ తర్వాత రూ.27 కోట్లు అంటూ పూటకో మాట మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. జగన్‌కు దమ్ము ఉంటే సిబిఐ ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును కోరాలని సవాల్ విసిరారు. పదేళ్ల పాటు ఏ వ్యక్తి బెయిల్‌పై ఇంతవరకు లేరన్నారు. సిఎంగా ఉన్నానన్న సాకుతో కోర్టు వెట్లు ఎక్కకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. సొంత బాబారు వివేకానంద రెడ్డిని చంపిన అవినాష్ రెడ్డి, లక్ష కోట్లు మింగిన జగన్మోహన్ రెడ్డి బెయిల్‌పై ఉండవచ్చు గానీ ఇంకెవరూ ఉండకూడదా అని ప్రశ్నించారు. న్యాయం ఆలస్యం కావచ్చు గానీ చివరకు గెలిచేది న్యాయమేనన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీత, టిడిపి పట్టణ అధ్యక్షులు ఎస్.మురళి, నాయకులు బోర గోవిందరావు, తమ్మినేని అప్పలనాయుడు, బి.వి రమణమూర్తి, లంక నాగరాజు, ఎన్.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.