Mar 19,2023 22:29

'యువగళం'లో మాట్లాడుతున్న నారా లోకేష్‌

ప్రజాశక్తి-నల్లచెరువు      జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక కొత్త పరిశ్రమలని ఏర్పాటు చేయడం మాట అటుంచి ఉన్న పరిశ్రమలను వేరే రాష్ట్రాలకు తరుముతున్నాడని, కమీషన్ల కోసం వేధిస్తున్నాడని నారా లోకోష్‌ దుయ్యబట్టాడు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 47వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు మండలం మీదుగా సాగింది. ఆదివారం నల్లచెరువు మండల పరిధిలోని తలమర్లవాండ్లపల్లి పంచాయతీ చిన్నపల్లోల్లపల్లి విడిదికేంద్రం నుండి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున లోకేష్‌కు స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే, కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌, శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షుడు బికె.పార్థసారథి, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి తదితరులు ఘనస్వాగతం పలికారు. లోకేష్‌ పాదయాత్ర చేస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రజలను పలకరిస్తూ, మాట్లాడుతూ ముందుకు నడిచారు. దేవిరెడ్డిపల్లిలో స్థానిక సర్పంచి హర్షవర్ధన్‌ నాయుడు లోకేష్‌కు గజమాలతో స్వాగతం పలికారు. తదుపరి పెద్దయల్లం పల్లి వద్ద మహిళలు పురుషులు, పిల్లలు జాతీయ రహదారిపై లోకేష్‌కు మంగళహారతి ఇచ్చి బాణాసంచా కాల్చి ఆహ్వానం పలికారు. సంజీవిపల్లి వద్ద ఆయన స్థానికులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాట్నాలపల్లి వద్దకు చేరుకున్న లోకేష్‌కు కురుబ కులస్తులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం రాగానే సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. చిన్న ఎల్లంపల్లి వద్ద పాదయాత్ర 600 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం జోగన్నపేట వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొత్త పరిశ్రమలని ఏర్పాటు చేయడం మాట అటుంచి ఉన్న పరిశ్రమలను వేరే రాష్ట్రాలకు తరుముతున్నాడని, కమీషన్ల కోసం వేధిస్తున్నాడని దుయ్యబట్టాడు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు 90 శాతం హంద్రీనీవా పనులు పూర్తి చేశామని మిగిలిన 10 శాతం పనులు పూర్తిచేసి సాగునీరు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఎకరానికి సాగునీటిని అందిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగం కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. శాసనసభలో ఎమ్మెల్యేలు ఓ మహిళ అని చూడకుండా తన తల్లిని తిట్టారన్నారు. తాను ఏనాడూ మహిళలను కించపరిచేలా మాట్లాడలేదన్నారు. వారి విమర్శలకు తన తల్లి నెల రోజులు బాధపడిందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక వారికి తగిన బుద్ధి చెబుతానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యేపై ఘాటు విమర్శలు..
కదిరి ఎమ్మెల్యే పివి.సిద్ధారెడ్డిపై లోకేష్‌ ఘాటు విమర్శలు చేశారు. కదిరిలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని, బైపాస్‌ రోడ్డు తెస్తానని, హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేశాడన్నారు. లక్ష్మీనరసింహస్వామి కోనేరు అభివృద్ధి పేరుతో నిధులు మింగాడని విమర్శించారు. నియోజక వర్గంలో రూ.50 వేలు పైబడి ఏ కాంట్రాక్టు అయినా తన బంధువులకు ఇప్పించుకుంటాడని ఆరోపించారు. ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డ్‌ భూములను ఆక్రమించుకుంటాడని తెలిపారు. ఎన్‌పి.కుంటలో వెలసిన సోలార్‌ ప్రాజెక్టు 9 ఏజెన్సీల నుండి దాదాపు రూ.8 కోట్లు వసూలు చేశాడని అన్నారు. గ్రామాల్లో రోడ్లు వేయరు కానీ స్థానిక ఎమ్మెల్యే తన అపార్డుమెంటుకు మాత్రం రూ.50 లక్షలతో రోడ్లు మాత్రం వేసుకున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం టిడిపి ఇన్‌ఛార్జి ఉమామహేశ్వర నాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్‌ రాజు, టిడిపి మండల కన్వీనర్‌ రాజశేఖర్‌, గాలివేటి కృష్ణమోహన్‌ నాయుడు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.