ప్రజాశక్తి- అనంపురం కలెక్టరేట్ రాష్ట్రంలో బిసిలు తీవ్ర వెనకబాటుకు గురువుతున్నారు. వైసిపి ప్రభుత్వ పాలనలో అన్యాయం జరుగుతోందని, వెనుకబడిన వర్గాలు, కులాలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే న్యాయం జరిగిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర 62వ రోజు కూడేరు నుంచి కమ్మూరు మీదుగా కోటంక, మర్తాడుకు చేరుకుంది. కమ్మూరులో బిసి సామాజికవర్గం ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖిలో లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేడు బిసిల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. వైసిపి ప్రభుత్వం బిసిలకు అన్యాయం చేస్తోందన్నారు. బిసిలపై అక్రమ కేసులు బనాయించి భయాందోళనలకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ రావడంలేదన్నారు. విదేశీ విద్య పథకాన్ని కూడా ఆపేశారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్ పథకాన్ని భ్రష్టు పట్టించారని తెలిపారు. బీసీ రెసిడెన్షియల్ హాస్టల్స్, కాలేజీలు ఏర్పాటు చేయలేదన్నారు. ఈడిగ కులస్తులను ప్రభుత్వం వేధిస్తోందన్నారు. బోయ కులస్తులకు ఎటువంటి సహాయం అందడం లేదన్నారు. పేరుకే కార్పొరేషన్‌లు ఉన్నాయన్నారు. ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బటన్ నొక్కినా తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు పడటం లేదన్నారు. బిసిలకు టిడిపితోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. టిడిపి ప్రభుత్వం రాగానే వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామన్నారు. సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పునరుద్ధరిస్తామన్నారు. బిసి ఉప కులాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈడిగ కులస్తులను ప్రోత్సహించింది టిడిపినే అన్నారు. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించామని, జగన్ సొంత మద్యం వ్యాపారం కోసం కల్లుగీత కార్మికులను వేధిస్తున్నాడని విమర్శించారు. మృతి చెందిన, గాయపడిన ఒక్క కల్లుగీత కార్మికుడి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. 26 వేల మంది బిసిలపై కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే చంద్రన్న బీమాని ఇంకా పటిష్టంగా అమలు చేస్తామన్నారు. జగన్‌కి బీసీలంటే ప్రేమ లేదని, అందుకే డమ్మీ కార్పొరేషన్‌లు పెట్టారని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు కేటాయిస్తామన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ చట్టం తీసుకొస్తామని, న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. నియోజకవర్గాల వారీగా బిసిలకు రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










