
* అవినీతి బురద అందరికీ అంటించే కుట్ర
* టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్‌ను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ అన్నారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై ఉన్న రూ.లక్ష కోట్ల అవినీతి బురదను అందరికీ అంటించేందుకు వ్యవస్థలను అడ్డంపెట్టుకుని జగన్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఆధారాల్లేని కేసుల్లో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించిన చంద్రబాబును నిర్భందించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ధ్వజమెత్తారు. నిన్నటి వరకు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అన్నారని, నేటికీ ఆధారాలు చూపలేకపోయారని చెప్పారు. ఇప్పుడు అమరావతిలో లేని రింగ్ రోడ్డులో అవినీతి జరిగిందని కేసు పెట్టి చంద్రబాబుతో సహా లోకేష్‌ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లకు పాల్పడిన వ్యక్తి జగన్ అని, రానున్న రోజుల్లో ఆ స్కామ్‌లన్నీ బయటపడతాయన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై విచారణ చేపట్టాలని బిజెపినే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిందన్నారు. దమ్ముంటే మద్యం స్కామ్‌లో విచారణను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. చంద్రబాబును అరెస్టు చేస్తే ముఖ్యమంత్రికి తెలియదని చెప్పడానికి సిగ్గుపడాలన్నారు. సైకో పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎం.జె బాబు, బొనిగి భాస్కరరావు, అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, సింతు సుధాకర్, నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.