ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
జగనన్న హయాంలోనే సంపూర్ణ సామాజిక న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం స్థానిక వైసిపి కార్యాలయంలో జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఎల్‌సి అభ్యర్థులు వంకా రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్, నియోజకవర్గంలోని జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఎంఎల్‌సి అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సామాజిక న్యాయం పాటించారన్నారు. జిల్లాలో రెండు ఎంఎల్‌సి స్థానాలు ఉండగా అత్యధిక సంఖ్యకులైన కాపు సామాజిక వర్గానికి ఒకటి, శెట్టిబలిజ వర్గానికి ఒకటి చొప్పున ముఖ్యమంత్రి కేటాయించారన్నారు. ఇందులో భాగంగా రవీంద్రనాథ్, శ్రీనివాసును అభ్యర్థులుగా ఎంపికచేసినట్లు తెలిపారు. ఈ నెల 13వ తేదీన జరిగే పోలింగ్‌లో జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు జాగ్రత్తగా వ్యవహరించి ఓటింగ్ చేయాలన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి రవీంద్రనాథ్‌కు తొలి ప్రాధాన్యతా ఓటు, శ్రీనివాస్‌కు రెండో ప్రాధాన్యతా ఓటు వేయాలన్నారు. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవులు ఇలా అన్నింటిలోనూ బిసిలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకమూ ఆర్థిక లబ్ధి నేరుగా మహిళల ఖాతాల్లో జమవుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా 65 లక్షల మంది వరకూ పెన్షన్ ఇస్తుంటే అందులోనూ 37 లక్షల మంది మహిళలే ఉన్నారన్నారు. ఎంఎల్‌సి అభ్యర్థి వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి తనను గెలిపించాలన్నారు. మరో ఎంఎల్‌సి అభ్యర్థి శ్రీనివాస్ మాట్లాడుతూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎంఎల్‌సి ఎన్నికలు నాంది ప్రస్తావన కావాలని కోరారు. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని వేయాలని సూచించారు. అనంతరం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్‌పిటిసిలు ముత్యాల ఆంజనేయులు, వరలక్ష్మి, ఎంపిపిలు పి.శేషులత, దాసరి హైమావతి, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










