ప్రజాశక్తి-రాయదుర్గం రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమైన సిఎం జగన్ అవినీతి పాలనను ప్రజలు తరిమికొట్టాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం రాయదుర్గంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మునిపెన్నడు చూడని కరెంటు కోతలు, ఛార్జీల మోతతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. గతనెలతో పోలిస్తే ఈనెలలో కరెంట్ బిల్లు దాదాపు రెట్టింపు అయిందన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు 25 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో నవ్యాంధ్ర ఏర్పడగా, ఆరు నెలల్లోగా మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుది అన్నారు. జగన్ అసమర్థత, అవినీతి వల్ల రాష్ట్రంలోని డిస్కములు తీవ్రనష్టాల్లో కూరుకుపోయాయన్నారు. గతేడాది జూన్‌తో పోలిస్తే ఎన్నడూ లేనంత 40 నుంచి 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో రాష్ట్రం అల్లాడిపోయిందన్నారు. ఈసారి విద్యుత్ సంక్షోభం రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ జగన్‌కు ఆదాయం.. ప్రజలకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అసమర్థ, స్వార్థపూరిత విధానాలు ప్రజలపై అదనపు భారం పడిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాము పోరాటం చేసినప్పటికీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రజలు జగన్ దుష్టపాలనను తరిమికొట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు










