అనంతపురం కలెక్టరేట్ : పేద కుటుంబంలో జన్మించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకున్న బాబూ జగ్జీవన్ రామ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా బుధవారం నాడు ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజాసంఘాల నాయకులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కళ్యాణదుర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఉషశ్రీ చరణ్, అనంతపురం సప్తగిరి సర్కిల్ వద్దనున్న ఆయన విగ్రహానికి కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తదితరులు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ ఆర్థిక, సామాజిక ఇబ్బందులను అధిగమించి ఉన్నత స్థానాలకు చేరుకోగలిగారన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం దగ్గరనుంచి స్వతంత్ర భారతావని నిర్మాణంలో మూడు దశాబ్ధాల పాటూ తన సేవలు అందించారన్నారు. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో రక్షణ మంత్రిగా దేశానికి ఘన విజయం అందించడంలో ఆయన ఎనలేని కషి చేశారన్నారు. అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఆహుడా ఛైర్‌పర్సన్ మహాలక్ష్మీ శ్రీనివాస్, ఉర్దూ అకాడమీ ఛైర్‌పర్సన్ నదీమ్ అహ్మద్, సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్ మేడా రామలక్ష్మి, డిప్యూటీ మేయర్ వాసంతి సాహితీ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విష్వమోహన్ రెడ్డి పాల్గొన్నారు.










