జెవివి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
ప్రజాశక్తి-కావలి : కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా పాఠశాల విద్యార్థులకు బుధవారం జన విజ్ఞానవేదిక (జెవివి) ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని, 8వ వార్డు మున్సిపల్ హైస్కూల్లో ' పోస్టల్ శాఖలో డిజిటల్ ఇండియా' అనే అంశంపై 10వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీలను పోస్ట్ మాస్టర్ ఎ.వి.కృష్ణయ్య, డిప్యూటీ పోస్ట్ మాస్టర్ ఎమ్ జి కె.సాయి, పాఠశాల ప్రధానోపాధ్యాయిని, సుజాత పోటీలను ప్రారంభించారు. డిజిటల్ ఇండియా పోస్టల్ శాఖలో ఎన్ని విధాలుగా ఆచరణలో ఉన్నది, గ్రామ స్థాయికి విస్తరించడానికి ఏ విధానాలు ఉపకరిస్తాయో తెలుపుతూ వ్యాసాలు రాయాలని వివరించారు. ప్రధమ బహుమతి రూ.25వేలు, ద్వితీయ బహుమతి రూ.10వేలు, తృతీయ బహుమతిగా రూ.5వేలు ఉంటుందన్నారు. పోస్ట్ మాస్టర్ కృష్ణయ్య సుకన్య సమృద్ధి యోజన, పిపిఎఫ్, కార్యక్రమం, మహిళాసమ్మాన్ సేవా డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, సేవింగ్స్ అకౌంట్లను గురించి తెలియజేశారు. కావలి జెవివి ఉపాధ్యక్షురాలు సి.శారద అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్ధులకు పోటీతత్వం పెంచి, ప్రగతి పథంలో దూసుకుపోతున్న డిజిటల్ రంగంలో మార్పు చేర్పులను రేపటి తరమైన విద్యార్ధులు అవగాహన చేసుకోవడం ఎంతో అవసరమన్నారు. తదనంతరం జరిగిన ''అంతర్జాతీయ బాలికా దినోత్సవ'' సదస్సులో పాఠశాల విద్యార్థులందరూ పాల్గొన్నారు. జెవివి ఉపాధ్యక్షులు కల్లయ్య మాట్లాడుతూ మహిళలు అభివృద్ధిలో ముందుకు దూసుకుని వెళ్తున్నారన్నారు. అన్ని రంగాలలో తమ సమర్థతను నిరూపించుకుంటున్నారని తెలిపారు. ప్రధాని ఇందిర, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేసిన మహిళాభివృద్ధి పథకాల గురించి తెలియజేశారు. పాఠశాల 10వ తరగతి విద్యార్థిని రితిక మాట్లాడుతూ అంతర్జాతీయ బాలికా దినోత్సవ సందేశ మిచ్చింది. పాఠశాల ప్రధానోపాధ్యాయిని సుజాత మాట్లాడుతూ నేటి విద్యార్థులను బహుముఖంగా తీర్చిదిద్దడంలో తమ సిబ్బంది ఇస్తున్న సహకారం ఎనలేనిదని చెపుతూ తమ పాఠశాలను ఈ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ - డిజిటల్ ఇండియా, అంతర్జాతీయ బాలికా దినోత్సవాల కార్యక్రమాలను నిర్వహించడానికి ఎంపిక చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వ్యాసరచనలో ప్రతిభ కనబరచిన రితికకు జనవిజ్ఞాన వేదిక ప్రత్యేక బహుమతినిచ్చి అభినందించింది. ఉపాధ్యక్షులు కల్లయ్య, ట్రెజరర్ టి.సుబ్బరామశర్మ, కార్యవర్గ సభ్యులు కె.జాన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.










