అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఈ ఎన్నికలకు ముందే తాడిపత్రిలో రాజకీయం జోరుగా మొదలైనట్టు కనిపిస్తోంది. జెసి కుటుంబం చుట్టూ చక్రబంధాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు సాగుతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆర్థికపరమైన అంశాలపై దెబ్బపడిన విషయం తెలిసిందే. ఇక రాజకీయపరంగానూ దెబ్బకొట్టేందుకు సొంత పార్టీలోనే అసంతృప్తులను రాజేసే ప్రయత్నాలను ప్రత్యర్థులు సైలెంట్‌గా చేపడుతున్నారన్న చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు అధికార వైసిపికి ధీటుగా నిలబడేందుకు జెసి కుటుంబం ప్రయత్నిస్తూ వస్తోంది. చిన్న అంశం దొరికినా అధికార పార్టీ నేతలపై విరుచుకుపడుతూ వస్తున్నారు. దీనికి అధికారపార్టీ నుంచి కూడా గట్టి సమాధానలే ఎదుర్కొనాల్సి వస్తూ ఉంది. అనేక అవరోధాలు, ఆటంకాలు ఎదురైనా పురపాలక సంఘం ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ టిడిపి కైవసం చేసుకుంది. స్వల్ప మెజార్టీతోనే పురపాలక పీఠాన్ని దక్కించుకున్నప్పటికీ, తమ పార్టీ తరుపున గెలుపొందిన వారెవరూ జారిపోకుండా చూసుకోగలిగారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా జెసి.ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఛైర్మన్ అయినప్పటి నుంచి కూడా ఆ పార్టీ కౌన్సిలర్లతో పాలకవర్గాన్ని నడిపించే ప్రయత్నం చేశారు. మునిసపాల్టీలో ప్రొటోకాల్ విషయంలోనూ ఇటీవల నిరసన సాగింది. అయితే ఉన్నఫలంగా టిడిపి కౌన్సిలర్ రాబర్టు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం కలకలం రేపుతోంది. ఆయన పదవికి రాజీనామా చేస్తే పాలకవర్గంలో టిడిపి బలం తగ్గే అవకాశం లేకపోలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని అధికారపార్టీ అవిశ్వాసాన్న పెడితే ఏమి జరుగుతుందోనన్న చర్చ నడుస్తోంది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగేళ్లు అవిశ్వాసం పెట్టేందుకు వీల్లేదన్న నిబంధన కొంత ఊరటనివ్వనుంది. అంతలోపు సార్వత్రిక ఎన్నికలు జరిగితే, తదనంతరం ప్రభుత్వం వచ్చాక చూసుకునే అవకాశం ఉంటుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలూ ఉన్నాయి. వాటికి సమయత్తమయ్యే పనిలోనూ జెసి కుటుంబముంది. ఈ క్రమంలో తాజాగా తాడిపత్రికి చెందిన అయూబ్ అనే మైనార్టీ నాయకుడు కూడా టిడిపికి రాజీనామా చేశారు. ఈయన జెసి ప్రబాకర్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం మరో చర్చనీయాంశమైంది. ఆయన వల్లనే పార్టీకి నష్టం జరుగుతోందంటూ రాజీనామా అనంతరం ఆరోపించారు. సొంత పార్టీ నుంచే వరుసగా మరో వ్యక్తి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వరుసగా సొంత పార్టీలో చోటు చేసుకుంటున్న రాజీనామాల పర్వం వెనుక కారణాలేమై ఉన్న్యా అన్న సందేహాలను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రత్యర్థుల ప్రమేయమం ఏమైనా ఉందా లేక స్వయం తప్పిదాలా అన్న చర్చ నడుస్తోంది. అటు పదవికి, ఇటు రాజకీయంగానూ రెండింటి ఒకేసారి దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాన్ని వారి అనుయాయులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తాడిపత్రిలో జరుగుతున్న ఈ పరిణామాలు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి.










