Aug 08,2023 22:43

జెండా

        అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రతి ఏడాది స్వాత్రంత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంటారు. అయితే ఆ సారి రానున్న 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో గందరగోళం కన్పిస్తోంది. ఈ వేడుకల నిర్వహణకు అవసరమైన కార్యక్రమాలు, పనులు చేపట్టడానికి నామినేషన్ల పద్ధతిలో కాకుండా షార్ట్‌ టెండర్ల ప్రక్రియలో చేపట్టాలని కమిషనర్‌ భాగ్యలక్ష్మి ఇటీవల నిర్ణయించారు. ఆఫీస్‌ నిర్వహణ బాధ్యతలు చూసే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శేఖర్‌ పదిరోజుల సెలవుపై వెళ్లారు. దీంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై కార్పొరేషన్‌లో గందరగోళం నెలకొంది. బుధవారం నుంచి తిరంగా యాత్రను నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిశగా అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే కార్పొరేషన్‌లో ఈ ఏర్పాట్లు చేసే అధికారులే కరువయ్యారు. ఐదు రోజుల క్రితమే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ దాక్షాయిని, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉమామహేశ్వరిలకు ఇన్‌ఛార్జి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అవసరమయ్యే ఏర్పాట్లలో భాగంగా మిలీనియం జెండా, టవర్‌క్లాక్‌ విద్యుదీపాలంకరణ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ విద్యుత్‌ దీపాలంకరణ, ఫ్లెక్సీల ఏర్పాటు, స్టాండ్‌ బైసెల్ఫీ తీసుకునే విధంగా చర్యలు చేపట్టడానికి వీలుగా షార్ట్‌ టెండర్ల నిర్వహణకు అవసరమయ్యే అంచనాలను తయారు చేయాలని సూచించారు. వీటిపై మేయర్‌ మహమ్మద్‌ వసీం పరిశీలన తర్వాత ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఫోనులో తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను నామినేషన్‌ పద్ధతిలో కాకుండా షార్ట్‌ టెండర్ల ప్రక్రియలో చేపట్టాలని స్వయంగా కమిషనర్‌ భాగ్యలక్ష్మి ఆదేశించినట్లు ఆయన వారికి వివరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉంది. అయితే ఇప్పటివరకు ఇందుకు సంబంధించి షార్ట్‌ టెండర్లను పిలిచిన దాఖలాలు లేవు. కనీసం నామినేషన్‌కు సంబంధించి కూడా టెక్నికల్‌ అనుమతి పొందని పరిస్థితి కార్పొరేషన్‌లో ఉంది. నామినేషన్‌ పద్ధతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల పనులు అప్పగిస్తారని తెలియడంతో కొందరు కాంట్రాక్టర్లు మిలీనియం జెండాను సైతం ముందస్తుగా తీసుకొచ్చి సిద్ధం చేశారు. కమిషనర్‌ భాగ్యలక్ష్మి ఆదేశాలు షార్ట్‌ టెండర్‌ నిర్వహించకుండా కాంట్రాక్టర్లు చక్రం తిప్పారు. దీన్ని బట్టి చూస్తే కార్పొరేషన్‌లో పాలకవర్గం నిర్ణయాలు చెత్తబుట్ట దాఖలు అవుతున్నాయనే విషయం స్పష్టం అవుతోంది. మంగళవారం సాయంత్రం నాటికి వేడుకల నిర్వహణపై అధికారుల్లో కొంత హడావుడి కన్పించింది. కార్యాలయం నిర్వహణతో సంబంధం లేని అధికారులకు పనులు అప్పగించడం చూస్తే కార్పొరేషన్‌లో పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఇట్టే అర్థం అవుతోంది. ఇంతటి గందరగోళ పరిస్థితుల నడుమ ఈ వేడుకలు ఎలా నిర్వహిస్తారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.