Jul 31,2023 21:48

ఇంటిగ్రేటెడ్‌ కోర్సు విద్యార్థులతో విసి రంగజనార్ధన

         ప్రజాశక్తి-అనంతపురం   అనంత జెఎన్‌టియు, స్వీడన్‌ బ్లేకింగ్‌ సంయుక్తంగా ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు అమలు చేస్తున్నట్లు ఉపకులపతి రంగజనార్ధన తెలిపారు. ఈమేరకు సోమవారం చేపట్టిన అడ్మిషన్‌ ప్రక్రియలో 12 మంది విద్యార్థులకు అడ్మిషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో భాగంగా బీ.టెక్‌ కోర్సు మూడు సంవత్సరాలు అనంతపురం జెఎన్‌టియు కళాశాల క్యాంపస్‌లో, ఒక సంవత్సరం విద్యను స్వీడన్‌ బ్లేకింగ్‌ యూనివర్సిటీలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. బీ.టెక్‌ డిగ్రీని అనంతపురం జెఎన్‌టియు, బిఎస్‌ పట్టాను బ్లెకింగ్‌ వర్శిటీ (స్వీడన్‌) ప్రదానం చేస్తుందన్నారు. తర్వాత ఎంఎస్‌ (మాస్టర్స్‌) ప్రోగ్రాంను స్వీడన్‌ బ్లేకింగ్‌ యూనివర్సిటీ చేయవచ్చన్నారు. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి ఇక్కడ విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌, డైరెక్టర్లు పి.సుజాత, ఆర్‌.కిరణ్మయి, వేల్పుల గురుదత్‌, జి.ఫణిశేఖర్‌ (బి.టి.హెచ్‌, స్వీడన్‌), ప్రతినిధులు పాల్గొన్నారు.