అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు బీ.ఫార్మసీ నాలుగవ సంవత్సరం రెండవ సెమిస్టర్ (ఆర్19) రెగ్యులర్, (ఆర్15) సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ఉపకులపతి జి.రంగజనార్ధన శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన బీ.ఫార్మసీ నాలుగవ సంవత్సరం రెండవ సెమిస్టర్ (ఆర్19) రెగ్యులర్ పరీక్షలకు 2,320 మంది హాజరవ్వగా, 1,829 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. దాదాపు 78.84 శాతం పాసయ్యారని తెలిపారు. ఇందులో బాలురు 927 మంది హాజరవ్వగా 607 మంది, బాలికలు 1,393 మంది హాజరవ్వగా 1,222 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. పరీక్ష ఫలితాలకు సంబంధిత రీకౌంటింగ్, ఫొటో కాపీ, ఛాలెంజ్ వాల్యూయేషన్ నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని చెప్పారు. శనివారం నుంచి వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. బీ ఫార్మసీ నాలుగవ సంవత్సరం రెండవ సెమిస్టర్ (ఆర్19) పరీక్షకు సంబంధించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు ఎం.ఫార్మసీ మొదటి సెమిస్టర్ (ఆర్21) రెగ్యులర్, సప్లిమెంటరీ, ఎం.ఫార్మాసీ మొదటి సెమిస్టర్ (ఆర్17) సప్లిమెంటరీ, ఎం.ఫార్మాసీ రెండవ సెమిస్టర్ (ఆర్21), (ఆర్17) సప్లిమెంటరీ పలితాలను విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఎం.విజయ కుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, అకడమిక్ డైరెక్టర్ వి.సుమలత, పరీక్షల విభాగం డైరెక్టర్ ఇ.కేశవ రెడ్డి , కంట్రోలర్ బి.చంద్ర మోహన్ రెడ్డి, అడిషినల్ కంట్రోలర్స్ డాక్టర్ యం.రామశేఖర రెడ్డి, కె.జయలక్ష్మి, జితేంద్ర గౌడ్, డాక్టర్ శ్రీధర్, డిప్యూటీ రిజిస్ట్రార్లు ఎన్.మధుసూధన రెడ్డి, ఎస్.రంగానాయక్ పాల్గొన్నారు.










