Jun 15,2023 17:19

నవుడూరు సెంటర్‌ వద్ద బహిరంగ చర్చకు రండి
కవురు శ్రీనివాస్‌కు సిపిఎం మాజీ ఎంపిపి జుత్తిగ నరసింహమూర్తి సవాల్‌
ప్రజాశక్తి - వీరవాసరం
జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా కవురు శ్రీనివాస్‌ ఏం వెలగబెట్టారో వీరవాసరం మండలం నవుడూరు సెంటర్‌ వద్ద బహిరంగ చర్చకు రావాలంటూ సిపిఎం సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపిపి జుత్తిగ నరసింహమూర్తి సవాల్‌ విసిరారు. జగనన్న కాలనీల్లో పూడిక పేరుతో మట్టిని అక్రమంగా దోచుకుంటున్న అధికార ప్రజాప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో దళితులు, పేదల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న అధికార ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ బాధితులకు సంఘీభావం తెలియజేస్తూ గురువారం సిపిఎం, టిడిపి నాయకులు వీరవాసరం బస్టాండ్‌ సెంటర్‌ వద్ద సిపిఎం మండల కన్వీనర్‌ పోతుల మృత్యంజయ అధ్యక్షతన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ ఎంఎల్‌సి కవురు శ్రీనివాస్‌ కమ్యూనిస్టుల పట్ల అవాకులూ, చవాకులూ మాట్లాడుతున్నారన్నారు. కమ్యూనిస్టులను విమర్శించే స్థాయి శ్రీనివాస్‌కు లేదన్నారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా, వీరవాసరం మండలానికి ఎంపిపిగా, ఉత్తరపాలెం ఎంపిటిసిగా నెగ్గిన నీవు ప్రజలకు నీవు ఏం వెలగబెట్టావో చెప్పాలని, నవుడూరు సెంటర్‌ వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు. చించినాడ పంచాయతీ అభివృద్ధిలో కమ్యూనిస్టుల పాత్ర ఎవరు దాచినా దాగదన్నారు. జగనన్న కాలనీల పేరుతో ఇక్కడ మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తూ అడ్డంగా దొరికిపోయినా నీతుల చెప్పడం వైసిపి నాయకులకే చెల్లిందన్నారు. చించినాడలో అరవై ఎకరాలు గోదావరి లంకభూములను సుమారు నాలుగు వందల కుటుంబాలు నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాయన్నారు. ఆ భూములను ఆనుకుని ఉన్న పెరుగులంక భూముల మట్టిని జగనన్న కాలనీలకు పూడిక పేరుతో నరసాపురం ఎంఎల్‌ఎ ముదునూరు ప్రసాదరాజు, ఎంఎల్‌సి కవురు శ్రీనివాస్‌ తరలిస్తున్నారన్నారు. అక్కడ భూమిని తవ్వితే వరదల సమయంలో కిందనున్న పట్టా భూములకు, గ్రామాలకు ముప్పుతప్పదన్నారు. అధిక మట్టితో లారీలు ఏటిగట్టు వెంబడి వెళ్తే ఏటుగట్టు బలహీనంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు మట్టి తరలింపును అడ్డుకుంటే వారిపై పెట్టారని, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎంపిపి వీరవల్లి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ దళితులు, పేదల ఓట్లతో గెలిచిన ఈ ప్రభుత్వం వారి పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. అండలూరులో ఎంపిటిసి ఇదే తరహాలో భూదందాలకు పాల్పడుతున్నాడంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వీరవల్లి దుర్గాభవాని, టిడిపి మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు లింగం సత్యనారాయణ, జ్యోతిబసు, సూర్యచంద్రరావు, సుబ్బారావు, చినవీరభద్రం, ఆలమహరాజు, రాంబాబు పాల్గొన్నారు.