అనంతపురం ప్రతినిధి : అల్పపీడిన ప్రభావం ఉమ్మడి అనంతపురం జిల్లాపైనా పడింది. జడివాన రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా భారీ వర్షాలేవీ నమోదవ లేదు. తేలికపాటి జల్లులు ఉదయం నుంచి రాత్రి వరకు పడుతూనే ఉన్నాయి. దీంతో సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. జనం బయటకు పూర్తి స్థాయిలో వచ్చి పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లాలో తాడిపత్రి ప్రాంతంలో కొద్దిగా ఎక్కువగా వర్షపాతం నమోదవగా సత్యసాయి జిల్లాలో హిందూపురం ప్రాంతంలోని మండలాల్లో కొద్దిగా ఎక్కువగా వర్షపాతం నమోదయింది.
అనంతపురం జిల్లాలో బుధవారం ఉదయం వరకు నమోదయిన సగటు వర్షపాతం 4.6 మిల్లీమీటర్లు ఉంది. ఇందులో అత్యధికంగా యాడికి మండలంలో 15.4 మిల్లిమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. గుమ్మగట్టలో కనిష్టంగా 1.2మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదయింది. మొత్తంగా చూసినప్పుడు జిల్లాలో జూన్ నుంచి ఇప్పటి వరకు 50.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చస్తే సాధారణ వర్షపాతం 116.4 మిల్లీమీటర్లు అయితే పడింది 96.3 మిల్లీమీటర్లు 17.2 శాతం తక్కువగా వర్షపాతం నమోదయ్యింది. సాధారణానికి దగ్గరగా వర్షపాతం నమోదయినట్టు కనిపించినా ఇంకా 18 మండలాల్లో వర్షపాతం లోటు నెలకొంది. ఇక సత్యసాయి జిల్లాలోనూ అన్ని మండలాల్లో వర్షపాతం నమోదవగా గోరంట్లలో అత్యధికంగా 21.4 మిల్లీమీటర్లు మంగళవారానికి నమోదయ్యింది. ఇక్కడా సాధారణ వర్షపాతం ఇప్పటి వరకు కురవాల్సింది 128.5 మిల్లీమీటర్లకుగానూ 95.2 మిల్లీమీటర్లు నమోదయ్యింది. ఇక్కడ ఇంకా 17 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
వర్షాలు నేడూ కొనసాగే అకాశం
వర్షాలు ఉమ్మడి అనంతపురం జిల్లాపై బుధ, గురువారాలున్నట్టు వాతావరణ శాఖ ప్రకటనలో పేర్కొంది. ఒక మోస్తరు వర్షాలు అనంతపురం జిల్లాలో పడుతాయని హెచ్చరించింది. సత్యసాయి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటనలో పేర్కొంది. వరుసగా పడుతున్న వర్షాల ప్రభావం కొన్ని పంటలపై ఉండే అవకాశముందని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. బుధవారం మధ్యాహ్నాం నుంచి వర్షపాతం మరింత పెరిగింది.
స్తంభించిన జనజీవనం
వర్షం తెరిపిలేకుండా వస్తుండటంతో సాధారణ జనజీవనం స్తంభించింది. రోడ్డుపై జరిగే చిరు వ్యాపారాలు మూతపడ్డాయి. జన సంచారం కూడా చాలా వరకు తక్కువగాా ఉంది. ఖరీఫ్‌లో ఇంకా పంటలు పూర్తి స్థాయిలో సాగవకపోవడంతో వర్షాధార పంటలకు పెద్దగా నష్టం వాటిల్లే అవకాశం లేనప్పటికీ ఉద్యానవన పంటలపై ప్రభావం చూపే అవకాశముంది. టమోటా పంట కొన్ని చోట్ల కోత దశకు వచ్చి ఉంది. అధిక వర్షాల వల్ల టమోటా దెబ్బతినే అవకాశమున్నట్టు రైతులు వాపోతున్నారు. మంచి ధర ఉన్న సమయంలో పడుతున్న ఈ వర్షం వల్ల రైతులకు నష్టం చేకూరుతుందన్న ఆందోళన నెలకొంది.










