
* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి- శ్రీకాకుళం: రాష్ట్రస్థాయిలో యోగాలో రాణించిన విధంగా జాతీయస్థాయిలో రాణించాలని ఎస్‌పి జి.ఆర్.రాధిక పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ నెల 14,15 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి 36వ యోగాసనం ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లాలోని ఇచ్చాపురానికి చెందిన మహంతి శ్రీకాంత్ మొదటి స్థానంలో, సాయి జగదీష్ ఐదు స్థానంలోను ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి యోగాసనానికి ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం శ్రీకాంత్, యోగ ట్రైనర్ హిమలు ఎస్‌పిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ జాతీయస్థాయిలో జరగనున్న యోగాసనాలలోనూ రాణించి జిల్లాలోని మరికొందరుని పిల్లలు, యువతి, యువకులు యోగాలో రాణించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. యోగ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని, రోజూ జిల్లా ప్రజలు యోగ కోసం కొంత సమయాన్ని కేటాయించి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.