Oct 09,2023 22:08

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
            ఎస్‌ఆర్‌కెఆర్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న ఆముదాలపల్లి జయశ్రీ హైదరాబాద్‌లో జాతీయ స్థాయిలో ఐదు రాష్ట్రాల పరిధిలో జరిగిన మాస్టర్‌ ఆరేటర్‌ ఛాంపియన్‌షిప్‌ ఇంగ్లీష్‌ స్పీకింగ్‌ కాంపిటీషన్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచిందని కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు చెప్పారు. ఈ నెల ఎనిమిదో తేదీన హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిస్పా, చత్తీష్‌గఢ్‌, నాగ్‌పూర్‌ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో 126 మంది పోటీల్లో నిలబడగా జయశ్రీ మొదటి స్థానంలో నిలిచి సుమారు రూ.1.50 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌ బహుమతిగా అందుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కళాశాలలో సోమవారం ఉదయం వందలాదిమంది విద్యార్థులు జయశ్రీకి అరుదైన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందించి కళాశాల ప్రాంగణంలో ఆమెను ఊరేగించారు. అనంతరం కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కెవి.మురళీకృష్ణాంంజులు జయశ్రీని, ఆమె తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్‌, ఫారిన్‌ లాంగ్వేజెస్‌ హెడ్‌ డాక్టర్‌ బిహెచ్‌విఎన్‌.లక్ష్మి, డాక్టర్‌ ఎం.శంకర్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ హెడ్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌ మాట్లాడారు. విద్యార్థి ప్రతినిధులు టోస్ట్‌ మాస్టర్‌ క్లబ్‌ అధ్యక్షులు ఎల్‌.కరుణాకర్‌ జయశ్రీని అభినందించారు.