
ప్రజాశక్తి - ఎచ్చెర్ల : జాతీయస్థాయిలో యూనివర్సిటీకి గుర్తింపు తీసుకురావాలని ట్రిపుల్ ఐటి డైరెక్టర్ పి.జగదీశ్వరరావు అన్నారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో విజయం సాధించిన రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ (ఆర్‌జియుకెటి) విద్యార్థులు ఇ.భరత్‌సాయి (మూడో స్థానం), పి.రజిత (4వ స్థానం), వై.నళిని, విజరు (6వ స్థానం), పి.తవిటి నాయుడు (7వ స్థానం), వి.మనోజ్ తరుణ్ (9వ స్థానం), కె.నరసింగరావు (10వ స్థానం) జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని స్థానిక ట్రిపుల్ ఐటిలో బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 27, 28 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి యూనివర్సిటీకి ప్రథమ స్థానం తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఒఎస్‌డి సుధాకర్‌బాబు, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ కొర్ల మోహనకృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ అసిరినాయుడు, యోగా విభాగాధిపతి డాక్టర్ ఈశ్వరరావు, యోగా అధ్యాపకులు అర్చన, ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.