'జాతీయ కార్మిక మహాసభకు వెళ్లకూడదు'
సిపిఎం జిల్లా కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన పోలీసులు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
ఈనెల 25, 26 తేదీల్లో తిరుపతిలో జరుగనున్న జాతీయ కార్మిక మహాసభలో కార్మికులకు అనుకూలమైన విధానాలు తీసుకురావాలని కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి వామపక్షాలు వెళ్లకూడదని మంగళవారం చిత్తూరు జిల్లా సిపిఎం కార్యదర్శి వాడ గంగరాజుకి టూటౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య హక్కులను పోలీసుల ద్వారా హరించి వేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో హక్కులను అడిగే హక్కు ఎవరికైనా ఉందని, చట్టబద్ధంగా వాటిని అడ్డుకోవడం ఏమిటంటే ప్రశ్నించారు. కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని తెలిపారు. పోలీసులు కార్మిక సంఘాలను, వామపక్ష పార్టీ నాయకులను అరెస్టులతో ఉద్యమాల ఆపలేరని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా 44 కార్మిక చట్టాలు ఉన్న వాటిని రద్దు చేసి కేవలం నాలుగు కోడ్‌లుగా తీసుకురావడం సిగ్గుచేటు అన్నారు. ఇవి కూడా యాజమాన్యాలు అనుకూలంగా తీసుకువచ్చారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కార్మికశాఖ అన్ని కార్మిక సంఘాలతో సంప్రదిస్తున్నదని, ప్రస్తుతం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక సంఘాలతో సంప్రదించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తూ సహకరించడం కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో జరిగే ఈ కార్మిక సదస్సు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.










