- 28,29న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి
- ఏఐబిఈఏ జాతీయ కార్యదర్శి రాంబాబు వెల్లడి
ప్రజాశక్తి- తిరుపతి టౌన్
కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ చేయడం మానుకోవాలని ఏఐబిఈఎ జాతీయ కార్యదర్శి బిఎస్ రాంబాబు తెలిపారు. ఆదివారం సాయంత్రం తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం సర్వసభ్య సమావేశం ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశం తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షులు పి.విజయ భాస్కర్, కార్యదర్శి జె.ధన్వంత్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎస్ రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లాభాల్లో వచ్చే జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణను చేసి కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పడం వల్ల దేశానికి తీరని నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే అనేక బ్యాంకులను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పారని గుర్తు చేశారు. మరి కొన్ని బ్యాంకులు ప్రైవేటీకరణ చేయడానికి అనుకున్నారని దీన్ని ఉద్యోగులు ఐక్యంగా ఉండి అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లాభాల్లో బ్యాంకులను ప్రైవేట్‌పరం కాకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకు ఉద్యోగులతో పాటు ప్రజలపై ఉందన్నారు ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆ సంఘం ప్రధాన కార్యదర్శి , పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఏవి రమణ మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకులు ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయల రుణాలు డీడీ రూపంలో చెల్లించి దేశాన్ని ప్రగతి బాటలో పయనించేలా చేస్తున్నామని చెప్పారు. బ్యాంకులు ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. యూనియన్ బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వి.ఉదరు కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకులు రైతులు, విద్యార్థుల రుణాల ద్వారా దేశానికి వెన్నెముక ఉండి కీలక పాత్ర పోషిస్తుందని బ్యాంకుల ప్రైవేటీకరణను నుండి ఉద్యోగులు, ప్రజలు కలిసి పోరాటం ద్వారా కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. ఏపీ అండ్ తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యదర్శి రమణ ప్రసాద్ మాట్లాడుతూ బడా వ్యాపారవేత్తలు రుణాలు బ్యాంకులో తీసుకొని దేశం విడిచి పారిపోయారని వారి ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏవిఆర్ మూర్తి, సభ్యులు జనార్ధన్, భాస్కర్, సుమలత, నిర్మలా దేవి, రేష్మ యజ్ఞేశ్ బాబు, నర్సింహులు నందగోపాల్ కేశవ రెడ్డి ఉమా మహేష్ పాల్గొన్నారు.










