
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలోనే అతి పెద్ద జామియా మసీదు అభివృద్ధికి పర్యాటక శాఖతో పాటు నగరపాలక సంస్థ నుంచి అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్.ఓబులేసు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా హెరిటేజ్ వాక్ ప్రత్యేక ర్యాలీని నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి సూర్యమహల్ కూడలి వరకు బుధవారం నిర్వహించారు. లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్‌పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కట్టడాలు, వాటి చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ ఏడాది పర్యాటక ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో పురాతన ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు, చూడచక్కని సముద్ర తీరాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు గీతా శ్రీకాంత్, యూత్ కోఆర్డినేటర్ ఉజ్వల్, సెట్‌శ్రీ సిఇఒ ప్రసాదరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి బాలమాన్ సింగ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధ, ఇంటాక్ పూర్వ కన్వీనర్ రాధాప్రసాద్, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ సూర్యచంద్ర, జామియా మసీద్ అధ్యక్షులు మహిబుల్లాఖాన్, ఉపాధ్యక్షులు సర్ఫరాజ్, కార్యదర్శి అక్బర్‌బాషా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.