Jun 17,2022 22:45

జాబ్‌ కార్డులున్న వారందరికీ ఉపాధి కల్పించండి
జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపడుతున్న పనులు రైతులకు ఉపయోగకరంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లాకలెక్టర్‌ ఐరాల మండలంలో విస్తతంగా పర్యటించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రం, హౌసింగ్‌, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పనితీరు, అమలు తీరును పరిశీలించారు. ఈపర్యటనలో భాగంగా తొలుత ఐరాల మండలం మొరుంపల్లి గ్రామపంచాయతీ, కోనగుంట హ్యాబిటేషన్‌లో చెన్నగొల్లపల్లి నుంచి కొనగుంట చెరువుకు జరుగుతున్న సప్లై ఛానల్‌ పనులను, మామిడి మొక్కలకు రింగ్‌ ట్రెంచెస్‌లో భాగంగా చేపట్టిన ఉపాధి పనులను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో చేపట్టే ప్రతిపని రైతులకు ఎంతగానో ఉపయోగపడేలా పనులను గుర్తించి చేపట్టాలన్నారు. ప్రధానంగా చెరువు పూడికతీత పనులు, సప్లై ఛానల్‌ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఐరాల మండలంలో 7,051 జాబ్‌కార్డులు కలవని, అందులో నేడు 1,875 మంది పని చేస్తున్నారని, ఈ మండలంకు 1,819 పనులు మంజూరు కాగా అందులో 572 పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. అలాగే వీటిలో ప్రధానంగా సప్లై ఛానల్‌, చెరువుల పునరుద్ధరణ, ఫారం పాండ్స్‌, డకోట్‌ ఫండ్‌ పనులు చేపట్టడం జరిగిందని కోనగుంట హ్యాబిటేషన్‌లో 180 జాబ్‌కార్డులు ఉండగా నేడు 103 మంది పనులు చేస్తున్నారని, చెన్నగొల్లపల్లి నుండి కోనగుంట చెరువుకు 1 కి.మీ సప్లై ఛానల్‌ పనులు చేపట్టగా అందులో 400 కిమీలు పూర్తి చేసామని ఏపిఓ సంధ్యారాణి కలెక్టర్‌కు వివరించారు.
అంగన్వాడీ కేంద్రాలలో రికార్డుల సక్రమంగా నిర్వహించాలి
అనంతరం 35-యర్లంపల్లి పరధిలోగల అంగన్వాడీ కేంద్రంను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. భోజనం చేస్తున్న పిల్లలందరికీ గుడ్డు సరఫరా చేశారా లేదా అని చిన్నపిల్లలను అడిగారు. పిల్లలందరూ గుడ్డును ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో అంగన్వాడీ పిల్లల నమోదు రిజిస్టర్‌లో పిల్లల వివరాలు నమోదుకు అంగన్వాడీ టీచర్‌ చెప్పే సమాధానంకు వ్యత్యాసం ఉండడంతో సక్రమంగా రికార్డుల నిర్వహణ చేయాలని సూచించారు. ఈకేంద్రంలో ఇద్దరు స్యామ్‌ మామ్‌ పిల్లలు ఉన్నారని, వీరికి బాలామతంతో పాటు పౌష్టికారం అందించడం, తల్లి తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలను వివరించడం జరిగిందని అంగన్వాడీ సూపర్‌వైజర్‌ కలెక్టర్‌కు వివరించారు. స్యామ్‌ మామ్‌ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని కలెక్టర్‌ సూపర్వైజర్‌ను ఆదేశించారు.
సచివాలయ సిబ్బంది, వాలంటీర్‌ లు ప్రజలకు అందుబాటులో ఉండండి
జిల్లా కలెక్టర్‌ తదుపరి 35-యర్లంపల్లి గ్రామ సచివాలయంను తనిఖీ చేశారు. వివిధ ప్రభుత్వపథకాల అర్హుల, అనర్హుల జాబితాలను పరిశీలించారు. అమ్మఒడి పథకం కింద అనర్హుల జాబితాలో ఉండడానికి గల కారణాలను వాలంటీర్లు కలెక్టర్‌కు వివరించారు. ఈసచివాలయ పరిధిలో మొత్తం 113 ఇళ్ళు మంజూరు కాగా ఇందులో బిబిఎల్‌-28, బిఎల్‌-36, ఆర్‌ఎల్‌ -10, ఆర్‌సి-22 కలవని 17ఇళ్ళు పూర్తి చేసామని, ఇందులో 87ఇళ్ళు సొంతస్థలాల్లో ఉండగా, దివిటివారిపల్లి లేఅవుట్‌లో16 ఇళ్ళు, బెస్తపల్లి లేఅవుట్‌లో10 ఇళ్ళు మంజూరు కావడం జరిగిందని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌కు వివరించారు. లబ్దిదారులకు అవగాహన కల్పించి త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు జరిగేలా చేస్తున్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ మున్నాను కలెక్టర్‌ అభినందించారు. అనంతరం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి వర్మి కంపోస్ట్‌ను తయారీ విధానాన్ని వ్యర్థ పదార్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అందుకు తగుచర్యలు చేపట్టాలని పంచాయతీ సెక్రటరీని కలెక్టర్‌ సూచించారు. అనంతరం వేదగిరివారిపల్లి సచివాలయంను పరిశీలించారు. సంక్షేమ పథకాలపై వాలంటీర్లు ప్రజలకు అవగాహన కల్పించే అంశం, ఇండ్ల పురోగతిపై వాలంటీర్లతో చర్చించారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి, ఇండ్ల పురోగతిలో ప్రతిభ కనపరచిన ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ శ్రీరాంను కలెక్టర్‌ అభినందించారు. దీనితో పాటు వాలంటీర్లు కూడా ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి పథకాల అమలుకు సంబంధించి బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అనంతరం ఇరువరం వద్ద గల లేఅవుట్‌ను పరిశీలించి త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టాలని లబ్దిదారులకు సూచించారు.
మెరుగైన వైద్యసేవలందించండి
తదుపరి ఐరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను పరిశీలించి ఆసుపత్రి ఆవరణంను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. ఈపిహెచ్‌సి పరిధిలో 60శాతం మందికి కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌ వేయడం జరిగిందని, గత మాసంలో 3 డెలివరీలు, ఈ మాసంలో 3డెలివరీలు చేసామని, రోజుకు వంద నుండి 130 వరకు ఓపికి పేషెంట్‌లు రావడం జరిగిందని మెడికల్‌ ఆఫీసర్‌ కలెక్టర్‌కు వివరించారు. క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్‌ వెంట డ్వామా పిడి చంద్రశేఖర్‌, తహశీల్దార్‌ బెంజిరాజ్‌, ఎంపిడిఓ నిర్మలాదేవి, ఎంపిపి లత, మెడికల్‌ ఆఫీసర్లు డాక్టర్లు లక్ష్మి నరసింహ, డాక్టర్‌ ప్రవీణ్‌, అధికారులు పాల్గొన్నారు.