Oct 16,2023 20:45

పరిశీలన ప్రక్రియను ప్రారంభిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల మొదటి దశ తనిఖీల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, ఎస్‌పి జి.ఆర్‌ రాధిక, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఇవిఎంలను భద్రపరిచే భవనంలో ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,357 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి అవసరమైన ఇవిఎంలను రెండు, మూడు వారాల పాటు రాజకీయ పార్టీల సమక్షంలో పూర్తిస్థాయిలో పరిశీలన చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రతి యంత్రంలోనూ ఓట్లు వేసి ఏదైనా సాంకేతిక లోపం ఉన్న వాటిని పక్కనపెట్టి, మిగిలిన వాటిని ఆమోదించే ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు. బెంగుళూరు నుంచి వచ్చిన బిఇఎల్‌ సిబ్బంది వెబ్‌కాస్టింగ్‌, పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య చేపడుతున్నారన్నారు. ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించే కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై ఇవిఎంల సాంకేతికతపై అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు. పరిశీలన సమయంలో కేంద్రంలోకి సెల్‌ఫోన్లు అనుమతించబోమని, గుర్తింపుకార్డులు ఉన్న సిబ్బంది మాత్రమే పనిచేస్తారని తెలిపారు. సిసి కెమెరాల్లో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, డిపిఒ ఎం.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.