Oct 15,2023 21:52

పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : ఎన్నికల నిర్వహణ సామగ్రిని భద్రపరిచేందుకు కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇవిఎం గోదాములను కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, ఎస్‌పి జి.ఆర్‌.రాధిక ఆదివారం తనిఖీ చేశారు. ఈనెల 16వ తేదీ నుంచి 20 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఇవిఎంల మొదటి దశ తనిఖీలను బెంగుళూరుకు చెందిన బిఇఎల్‌ ఇంజినీర్లు చేపట్టనున్నారని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఉన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేసేందుకు మొదటి దశ ఇవిఎంల తనిఖీలకు రోజూ హాజరు కావాలని సూచించారు. ఇప్పటికే ఆయా పార్టీలకు సమాచారం అందించామన్నారు. ఇవిఎం గోదాముల వద్ద కట్టుదిట్టమైన భద్రతను, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. జిల్లాకు మొదట విడతలో వివి ప్యాట్స్‌ 7,080, కంట్రోల్‌ యూనిట్స్‌ 5,831, బ్యాలెట్‌ యూనిట్స్‌ 7,523 చేరుకున్నాయన్నారు. ఇవిఎంల తనిఖీల నిర్వహణ సమయంలో మొబైల్‌ ఫోన్లు, డిజిటల్‌ వాచ్‌, ఇయర్‌ పాడ్స్‌ లోపలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఏర్పాటు చేసిన కౌంటర్లలో విధిగా డిపాజిట్‌ చేయాలని చెప్పారు. ఇవిఎంల పరిశీలనలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, సి-సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ప్రకాష్‌, డిప్యూటీ తహశీల్దార్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.