Feb 24,2023 23:20

ప్రజాశక్తి - యలమంచిలి
                మండలంలోని ఏనుగువానిలంక పరిధిలో ఉన్న లంక భూముల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కమిటీ డిమాండ్‌ చేసింది. మండలంలోని చించినాడ అమరవీరుల స్మారక భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి బాలరాజు మాట్లాడారు. హౌసింగ్‌ జిల్లా అధికారులు, యలమంచిలి రెవెన్యూ అధికారులు ఇరువురు మట్టి మాఫియాతో చేతులు కలిపి పేరుకు మాత్రం జగనన్న లే అవుట్ల పూడికకు అని చెప్పి రూ.కోట్లు విలువైన ఇసుకను పక్కదారి పట్టించారన్నారు. ఈ క్రమంలో ఇసుక తరలింపును అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులకు ఇక్కడి ఇసుకను తవ్వడానికి జిల్లా కలెక్టర్‌ అనుమతులు ఉన్నాయని, అడ్డొస్తే పోలీస్‌ ఫోర్స్‌ను దింపి కేసులు పెడతామని బెదిరించి మరీ గోదావరి నది గర్భాన్ని ఆనుకొని వందలాది టిప్పర్లతో ఇసుకను నెల రోజులుగా తవ్వేశారన్నారు. దీనిపై డి ఫారం పట్టా లంకభూముల డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో కోర్టులో కేసు వేసిన నేపథ్యంలో కోర్టు అడిగిన ప్రశ్నకు మైనింగ్‌ అధికారులు తాము ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని సమాధానం చెప్పారన్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతి లేకపోయినా ఇసుకను తరలించారంటే ఎంతటి ఇసుక కుంభకోణం జరిగిందో అర్థమవుతుందని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బాతిరెడ్డి జార్జి, మండల నాయకులు దేవ సుధాకర్‌, ఎడ్ల మోహన్‌రావు, బాతిరెడ్డి సుగుణ, గొల్ల ఏడుకొండలు, రాజు పాల్గొన్నారు.