Mar 27,2022 23:32

ఇసుక రీచ్‌ ను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం డిమాండ్‌
ప్రజాశక్తి - పిచ్చాటూరు

మండలంలోని ఎస్‌ఎస్‌బి పేట వద్ద ఇసుకను అక్రమంగా చేస్తున్న రవాణాను తక్షణమే అరికట్టాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హేమలత, దాసరి జనార్ధన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, ఎస్‌ఎస్‌బి పేట వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సంఘాల ఆధ్వర్యంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక క్వారీలను, రైతు నాయకులు, గ్రామ వెల్‌ఫేర్‌ సంఘం నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఎస్‌బి పేట వద్ద మైనింగ్‌ అధికారులు ఇచ్చిన కొలత మేరకు కాకుండా ఇసుక కాంట్రాక్టర్లు వారు ఇష్టారాజ్యంగా అయిదు అడుగుల నుంచి 30 అడుగుల వరకు నీటి లోపల కూడా తవ్వకాలు జరిపి ఇసుకను యథేచ్ఛగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.15 టన్నుల ప్రాసింగ్‌ కెపాసిటీ కలిగిన టిప్పర్‌లో 30 టన్నుల వరకు, 20 టన్నుల ప్రాసింగ్‌ కెపాసిటీ కలిగిన టిప్పర్లలో 40 నుంచి 50 టన్నుల వరకు ఇసుకను తరలిస్తున్నా కూడా మైనింగ్‌ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, తనిఖీలు చేసిన పాపానపోలేదని దుయ్యబట్టారు. అక్రమంగా తరలిస్తున్న టిప్పర్‌ల వద్ద పర్మిషన్‌ ఉందా లేదా అని చూస్తున్నారు తప్ప, వారు ఎన్ని టన్నులకు పర్మిషన్‌ తీసుకుని ఎన్ని టన్నులు లోడ్‌ చేస్తున్నారో తనిఖీ చేసే యంత్రాంగమే లేదని విమర్శించారు. ఇసుకను నిబంధనలకు వ్యతిరేకంగా అధిక లోతు తవ్వకాలు జరుగుతున్నందువలన అరణియార్‌ నదీ పరివాహక గ్రామాలైన, ఎస్‌ఎస్‌బిపేట, హనుమంత పురం, కారణి, సురుటుపల్లి, నాగలాపురం, బంగాళా, ఈండ్ర పేట, అడవికోడింబేడు, బయట కోడింబేడు, కారూరు, తదితర గ్రామాల రైతులు నీటి మట్టం పడిపోయి, గర్భ జలాలు అడుగంటుతాయని ఆందోళన వెలిబుచ్చారు.
తక్షణమే అధికారులు స్పందించి ఇక్కడ నిర్వహిస్తున్న ఇసుక మైనింగ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే దశలవారీ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌బిపేట వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, రిటైర్డ్‌ సిఐ చంద్రన్‌, కార్యదర్శి సురేష్‌, కెవిపిఎస్‌ పిచ్చాటూరు మండల కార్యదర్శి పిజి రంగరాజన్‌, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు ఓబులు, రైతులు, గ్రామస్తులు యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.