ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల రైతు సంఘం నాయకులు సిద్ధవరపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం లేబూరు గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను సిపిఎం నేతలతో కలిసి అడ్డుకున్నారు. అనంతరం గ్రామ సచివాలయంలో గ్రామస్తులతో కలిసి అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్నా పోర్లు కట్ట నుండి యథేచ్ఛగా ఇసుకను తరలిస్తుంటే అధికారులు మామూళ్ల మత్తులో తులతూగుతూ పట్టించుకోవడం లేదన్నారు. ఇసుక అక్రమ రవాణా ముదివర్తిపాలెం నుండి లేబూరు గ్రామం మీదుగా రాత్రింబవళ్లు తేడా లేకుండా పలు ప్రాంతాలకు అధిక స్పీడుతో ట్రాక్టర్లు వెళ్తున్నాయన్నారు. తరచూ గ్రామంలో ప్రమాదాలు జరుగుతున్న కూడా, పలుమార్లు గ్రామస్తులు హెచ్చరించినా అక్రమార్కులు పెడచెవిన పెట్టి అక్రమంగా ఇసుక రవాణా సాగిస్తున్నారన్నారు. పాఠశాలకు వెళ్లే పిల్లల నుండి కాలినడకన వెళ్లే పాదచారులు వరకు అందరూ తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాలను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో లేబూరు కార్యదర్శి రవీంద్ర, కరిముల్లా, మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు.










