అనంతపురం ప్రతినిధి : ప్రభుత్వం రైతు భరోసాతోపాటు ఇన్‌ఫుట్ సబ్సిడీని రైతులకు అందజేయనుంది. ఈనెల 30వ తేదీనే రైతు భరోసాతోపాటు దీనినిని వేయనుంది. ఉద్యానవన పంటలు, వ్యవసాయ పంటలు దెబ్బతిన్న పంటలు రెండింటికీ రూ.8.35 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేయనుంది. సత్యసాయి జిల్లాకు రూ.49.20 లక్షలు రానుంది. అనంతపురం జిల్లాలో 1946 హెక్టార్లలో వ్యవసాయ పంటలు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పడిన అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి మొత్తం 2832 మంది రైతులకు నష్టం వాటిల్లింది దీనికి సంబంధించి రూ.2.60 కోట్లు మంజూరు చేశారు. ఇక ఉద్యానవన పంటలకు సంబంధించి 2356 హెక్టార్లలో 2479 మంది రైతులకు నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి రూ.5.75 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ రానుంది. రెండు రకాల పంటలకు సంబంధించి 5311 మంది రైతులు 4303 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రెండు రకాల పంటలకు కలిపి మొత్తం రూ.8.35 కోట్లు మంజరైంది. సత్యసాయి జిల్లాకు సంబంధించి వ్యవసాయ పంటలకు రూ.31.22 లక్షలు, ఉద్యానవన పంటలకు సంబంధించి రూ.17.97 లక్షలు మంజూరైంది. మొత్తం రూ.49.20 లక్షలు మంజూరైంది.
శింగనమలకే అత్యధిక పరిహారం
పంటనష్ట పరిహారానికి సంబంధించి అనంతపురం జిల్లాలో శింగనమల నియోజకవర్గం పరిధిలోనే అత్యధికంగా వ్యవసాయ పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ అందనుంది. 1611 హెక్టార్లకు సంబంధించి రూ.2.01 కోట్లు పరిహారం రైతులకు అందనుంది. మార్చి నెలలో నార్పల మండలంలో పడిన వడగండ్ల వానకు పెద్దఎత్తున పంటలకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. శింగనమల, పుట్లూరు, నార్పల మండలాల్లో ఎక్కువగా పంటలకు నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతంలోనే ఇన్‌పుట్ సబ్సిడీ అధికంగా రానుంది. ఉద్యానవన పంటలు కూడా ఈ ప్రాంతంలోనే అధికంగా నష్టం వాటిల్లడంతో ఆ పంటలకు ఈ మండలాల్లోనే అధికంగా ఇన్‌పుట్ సబ్సిడీ రానుంది.
రైతు భరోసానూ పంపిణీ
రైతు భరోసా మొత్తాన్ని కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.158 కోట్లు మంజూరు చేయనున్నారు. దీంతో అధిక వర్షాలతో మార్చి, ఏప్రిల్ , మే నెలలో దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా రానుండటంతో సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం పంటనష్టాన్ని, రైతు భరోసానూ రైతులకు అందజేయనుంది. ఈ సీజన్ పెట్టుబడులకు ఈ రెండు ఇవ్వడంతో రైతులకు కొంత ఊరట లభించనుంది. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్‌లో రెండింటి వలన అధిక వర్షాలకు రైతులకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం పంటనష్టంతోపాటు, రైతు భరోసాను కలిపి ఒకేసారి ఇవ్వడంతో నష్టపోయిన రైతుకు ఒకేసారి రెండు కలసి రావడంతో ఈ ఖరీఫ్‌కు పెట్టుబడులకు ఇబ్బందులేకుండా ఉండేందుకు వీలుంది.










