అనంతపురం కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకూ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ఎదుట సోమవారం నాడు ధర్నా నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్ గేటు ఎదుట రోడ్డుపై బైటాయించి ధర్నా నిర్వహించారు. విద్యార్థుల సమస్యల పరిష్కరించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, ధర్నా వద్దకు వచ్చి విద్యార్థులతో మాట్లాడాలంటూ నాయకులు ఆందోళన నిర్వహించారు. అప్పటికే అక్కడున్న సిఐ రెడ్డప్ప నేతృత్వంలోని పోలీసులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అంతకుమునుపు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పుస్తకాలు ఇస్తున్నామని ప్రభుత్వ చెబుతోందన్నారు. ఇంత వరకు పాఠ్యపుస్తకాలు అందలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం వాటిని ఇవ్వలేమని విద్యా శాఖ మంత్రి ప్రకటన చేయడం అన్యాయంగా ఉందన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు అనేక సమస్యల నడుమ విధ్యనభ్యసిస్తున్నారని తెలిపారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పురాతన భవనాలు పెచ్చులు ఊడిపోతూ వర్షం నీరు కారడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అద్దె భవనంలో ఉన్న సంక్షేమ హాస్టళ్లలో సరైన మంచినీరు, మరుగుదొడ్లు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి నాడు-నేడు పనులు ప్రారంభించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. వసతి, విద్యా దీవెన పథకం డబ్బులు ఇప్పటికీ విద్యార్థుల ఖాతాల్లోకి జమ కాలేదన్నారు. వెంటనే విద్యా దీవెన, వసతి దీవెన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురుకులం, కేజీబీవీ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారించాలన్నారు. జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు శివ, రాష్ట్ర కమిటీ సభ్యులు వైటిసి.రమేష్, రజిత, జిల్లా నాయకులు తరిమెల గిరి, సిద్దు, సూర్యప్రకాష్, వరుణ్, వెంకీ, వర్ధన్, శివ, రాజేష్, రజిత, సూర్య, శశి విద్యార్థులు పాల్గొన్నారు.










