Jul 17,2023 22:37

తాడిపత్రిలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

          ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌   ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు తక్షణమే పాఠ్యపుస్తకాలను అందజేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వరుణ్‌ మాట్లాడుతూ కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు సరఫరా చేయకపోవడం అన్యాయమన్నారు. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఇవ్వమని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే నూతన విద్యావిధానం అమలు చేయడం వల్ల అనేకమంది విద్యార్థులను విద్యకు దూరం అయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందించాలని, లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం చేపట్టి ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అరవింద్‌, కళ్యాణ్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
శింగనమల : ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రం లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఇఒ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శులు సూర్య ప్రకాష్‌, తరిమెల గిరి మాట్లాడుతూ ఇంటర్‌ తరగతులను ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకూ పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ధనుష్‌, వర్ధన్‌, బాబాఫక్రుద్దీన్‌, నిరంజన్‌, సందీప్‌, రాజేష్‌, సురేష్‌, కృష్ణ, వంశీ, మురళి పాల్గొన్నారు.