Jul 20,2023 08:50

చలో విజయవాడలో అరెస్టు అయిన అనంతపురం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

          అనంతపురం కలెక్టరేట్‌ : ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. విజయవాడలోని ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ కార్యాలయం ముట్టడి చేపట్టారు. ఈ పోరాటంలో అనంతపురం జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ నేతలు పాల్గొన్నారు. పోరాటంలో భాగంగా పోలీసులు అనంతపురం జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్‌, నాయకులు సిద్దు, షమీర్‌, రాఘవేంద్ర, వినోద్‌, చంద్ర, ముస్తఫా తదితరులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఓతూరు పరమేష్‌ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. విద్యార్థులకు తక్షణం పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్నారు. హాస్టల్స్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. సమస్యలు పరిష్కరిస్తే ఉద్యమాలు చేయాల్సిన అవసరం మాకు ఉండదన్న విషయాన్ని ప్రభుత్వ పాలకులు గ్రహించాలని హితవు పలికారు.