Jul 19,2022 22:28

ఇంటర్‌ విద్యార్థుల అభివృద్ధికే పరిశీలిన కమిటీ ఏర్పాటు
డిఆర్‌ఒ రాజశేఖర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

విద్యార్థులలో మానసిక ఒత్తిడి తగ్గించి వారిలో పరిపక్వత పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ స్థాయిలో డిస్ట్రిక్ట్‌ మానిటరింగ్‌ అండ్‌ సూపర్వైజింగ్‌ కమిటీ నియామకం చేసిందని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.రాజశేఖర్‌ అన్నారు. మంగళవారం సాయంత్రం డిఆర్‌ఓ అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 30 ప్రభుత్వ, 150కి పైగా ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించడం జరిగిందని ప్రతినెల రెండు కళాశాలలను కమిటీ సందర్శించాలన్నారు. అనంతరం సమావేశాలు నిర్వహించి కళాశాలల పనితీరుపై నియమావళి ప్రకారం ఉన్నాయా లేదా అని మానిటరింగ్‌ చేయాలని అన్నారు. దీనికి సంబంధించి ఒక నివేదికను జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా కాలేజీల పనితీరు ఎలా ఉందని విద్యార్థులకు సరిపడా వాతావరణం ఇతర పరిస్థితులు వారికి చదువు మీద ఒత్తిడి లాంటివి ఏవైనా ఉన్నాయా అని పరిశీలించాలని అన్నారు. అదేవిధంగా తరగతిగదులను వారికి కల్పించబడిన వాతావరణం, నీటి వసతులు, క్రీడా మైదానం లాంటివి ఉండేలా చూడాలని వారిలో వచ్చే మార్పుకు అనుగుణంగా పరిస్థితులు ఉన్నాయా లేదా అని ఆ నివేదికలో పొందుపరచాలన్నారు. పిల్లల మీద ఒత్తిడి ముఖ్యం కాదు వారి భవిష్యత్తు దష్ట్యా ఆరోగ్యంగా ఉండేలా చూడాలన్నారు. నిబంధనల ప్రకారం ఆ కళాశాల నిర్వహణ జరుగుతోందా లేదా అని చూడాలన్నారు. దీని ద్వారా ఇంటర్‌ విద్యార్థులలో డిప్రెషన్‌ రాకుండా, దాని ద్వారా వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. విద్యార్థి దశలో ఇంటర్‌ చాలా ప్రాధాన్యత గల దశ అని అన్నివిధాల వారు ఆరోగ్యవంతంగా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలు గురించి ప్రధానంగా చర్చించారు. ఈకమిటీలో జిల్లా రెవెన్యూ అధికారి చైర్మన్‌గా, ఎస్పీ, జిల్లా ఒకేషనల్‌ విద్య అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, ఐసిడిఎస్‌ అధికారులు, మున్సిపల్‌ వైద్యాధికారులు, వైద్యశాఖ అధికారులు, ఫుడ్‌ ఇన్స్పెక్టర్‌, రీజనల్‌ ఇంటర్‌ అధికారి, ఫైర్‌ అధికారి సభ్యులుగా ఉంటారని డిఆర్‌ఓ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మానసిక పరిపక్వతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పలు కళాశాలలను పరిశీలించిన తర్వాత ఈ కమిటీ నియామకం జరిగిందని సంబంధిత శాఖల వారు తప్పనిసరిగా కళాశాలలను తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారితో పాటు జిల్లా ఒకేషనల్‌ అధికారి దయానంద రాజు, అడిషనల్‌ ఎస్పీ జగదీష్‌, జిల్లా వైద్యాధికారి రామ్‌ నారాయణ రెడ్డి, ఆర్‌ఐఓ గోపాల్‌ రెడ్డి, జిల్లా ఫైర్‌ అధికారి పెద్దిరెడ్డి ,జిల్లా విద్యాశాఖ అధికారులు, ఐసిడిఎస్‌ అధికారులు, ఫుడ్‌ ఇన్స్పెక్టర్‌, తదితరులు పాల్గొన్నారు.