ప్రజాశక్తి - ఆచంట
ఆచంట ఎంవిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కె.సోని తెలిపారు. జనరల్ 67 మంది విద్యార్థులు గాను 64 మంది హాజరు కాగా మరో ముగ్గురు విద్యార్థులు గైరహాజరైనట్లు తెలిపారు. అలాగే 37 మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 36 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు తెలిపారు. మొత్తం 104 మంది విద్యార్థులకు గాను 100 మంది హాజరయ్యారని, నలుగురు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ కిట్లు, తాగునీరు, మరుగుదొడ్లు ఉండేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సీసీ కెమెరాల మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆకివీడు : ఇంటర్మీడియట్ పరీక్షలు మొదటి రోజు బుధవారం ప్రారంభమయ్యాయి. విద్యావికాస్, కార్తికేయ, దుంపగడప ఆంధ్రకేసరి ప్రకాశం శతజయంతి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించారు. విద్యా వికాస్‌లో 261 మంది విద్యార్థులకు గాను 14 మంది గైర్హాజరుకాగా, 247 మంది హాజరయ్యారు. కార్తికేయలో 179 మందికి కేటాయించగా ఎనిమిది మంది గైర్హాజరయ్యారు. 171 మంది పరీక్ష రాశారు. దుంపగడప ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 219 మంది హాజరయ్యారు, 13 మంది గైర్హాజరయ్యారు.
ఉండి : యండగండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు మొదటిరోజు ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారని కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ ఉండా దుర్గారావు తెలిపారు. యండగండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 201 మంది విద్యార్థులకు గాను 196 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించినట్లు తెలిపారు.
పాలకొల్లు : పట్టణంలోని 7 కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తోపాటు పోలీసులను ఏర్పాటు చేశారు. అరగంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. దాదాపు 200 మంది విద్యార్థులు మొదటి రోజు పరీక్షలు రాశారు.
పట్టణంలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ ఎం.సూర్యతేజ పరిశీలించారు. ఆయన వెంట పట్టణ సిఐ డి.రాంబాబు, ఇన్‌ఛార్జి తహశీల్దార్, కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు.
పెనుగొండ : మండలంలో వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్ మొదటి రోజు పరీక్ష బుధవారం ప్రారంభమైంది. ఎస్‌వికెపి పివి జూనియర్ కళాశాలలో 626 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 24 మంది గైర్హాజరయ్యారు. మహిళా కళాశాల 179 విద్యార్థులు హాజరయ్యారు. విశ్వతేజ జూనియర్ కళాశాలలో 235 మంది హాజరయ్యారు. ఆరుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆయా పరీక్షా కేంద్రాలను సబ్ కలెక్టర్ సూర్య తేజ పరిశీలించారు.










