Mar 14,2023 19:07

ప్రజాశక్తి - ఆకివీడు
మండలంలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు కేంద్రాలు సిద్ధమయ్యాయి. మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యా వికాస్‌, కార్తికేయ, దుంపగడప ఆంధ్రకేసరి ప్రకాశం శతజయంతి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలలో పరీక్షలు నిర్వహించే మూడు కళాశాల విద్యార్థులతో పాటు స్థానిక వాసవి శారద జూనియర్‌ కళాశాల, ఇమ్మానుయేలు ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామంలో బాలజ్యోతి జూనియర్‌ కళాశాల కాళ్ల గ్రామంలోని జగన్‌ సాయి జూనియర్‌ కళాశాలకు చెందిన ఏడు కళాశాలల్లో సుమారు 1600 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 850 మంది జూనియర్‌ ఇంటర్‌, 750 మంది సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సుమారు 60 మంది ఇన్విజిలేటర్లతో పాటు ప్రత్యేక పరీక్షా నిర్వాహకులుగా డిపార్ట్మెంటల్‌ ఆఫీసర్స్‌, చీఫ్‌ సూపరింటెండెంట్స్‌ నిర్వహిస్తున్నారు. ఆయా కళాశాల వద్ద 144 సెక్షన్‌ విధించినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు.
పాలకొల్లు:పట్టణంలోని 7 కేంద్రాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. దీనికి సంబంధించి అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కోకోనట్‌ మర్చంట్స్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆదిత్య జూనియర్‌ కళాశాల, కెవిఎం ఛాంబర్స్‌ జూనియర్‌ కళాశాల, గౌతమి జూనియర్‌ కళాశాల, శ్రీ చైతన్య జూనియర్‌, కళాశాల, సబిత జూనియర్‌ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. పట్టణంలో 2 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులను, అధికారులను ఇన్విజిలేటర్లుగా నియమించారు.