Jun 24,2023 09:04

విలేకరులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి

          అనంతపురం కలెక్టరేట్‌:ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలను అందజేయడం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్ధేశమని జిల్లా కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, జెడ్పీ సిఇఒ భాస్కర్‌రెడ్డితో కలిసి పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వర్చువల్‌ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నాడు లాంఛనంగా ప్రారంభించారన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతున్నందున ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు తెలిపారు. ఇదివరకే సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో దీనిపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. దీనికోసం పట్టణ, గ్రామీణ పరిధిలో రెండు బందాల ఏర్పాటు మండల స్థాయిలో ఎంపీడీవో డిప్యూటీ తహశీల్దార్‌ ఒక బందం, తహశీల్దార్‌ పంచాయతీరాజ్‌ ఈవోలతో కూడిన మరో బందాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమం పర్యవేక్షణకై నియోజకవర్గ, మండల స్పెషల్‌ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. శనివారం నుంచి ముందస్తు ప్రణాళిక బద్ధంగా జిల్లాలో ఉన్న 663 సచివాలయాల్లో ఉన్న వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములై ప్రతి ఇంటినీ సందర్శించి అర్హులై ఉండి ఎక్కడైనా ప్రభుత్వ పథకాల లబ్ధి అందని వారుంటే అలాంటి కుటుంబాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి వివరాలను సేకరిస్తారన్నారు. కుల, ఆదాయ, జనన, మరణ, సిసిఆర్‌సి రేషన్‌ కార్డు హౌస్‌ హోల్డ్‌ తదితర 11 రకాల సేవల పత్రాలను తీసుకుని ఆయా దరఖాస్తుల ద్వారా సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి టోకెన్‌ నెంబర్‌ సర్వీస్‌ రిక్వెస్ట్‌ ద్వారా ఉచితంగా వారికి సేవలు అందించాల్సి ఉందన్నారు.