ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
'ఇంటింటికి సిపిఎం' దృష్టికి 'దారి' ఆక్రమణల సమస్యలు వచ్చాయి. శనివారం సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు నేతృత్వంలో మురికివాడల్లో నేతలు సందర్శించారు. 'అక్కయ్యా... చెల్లెమ్మ... అన్నయ్యా...' అంటూ పలకరిస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కుళాయిల్లో నీరు రావడం లేదని, డ్రైనేజీలు లేక మురికినీరు రోడ్లపైనే పారుతోందని తెలిపారు. ఓ ప్రముఖ కోళ్లఫారం యజమాని దారిని కబ్జా చేశారని కలెక్టరేట్‌కు అతి సమీపంలో నివాసం ఉంటున్న వళ్లియప్పనగర్‌కు చెందిన సెల్వి వాపోయింది. దారిని ఆక్రమించుకున్న కోళ్లఫారం యజమానిపై చర్య తీసుకుని, స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇల్లులేని పేదలకు మంజూరు చేయాలని నేతలు డిమాండ్‌చేశారు. ఇరువారం దళితవాడలో అధిక సంఖ్యలో దళితులు ఉన్నారని, నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌లో నీళ్లు రాలేదని వాపోయారు. కరెంట్ స్తంభాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వీధి దీపాలు లేక రాత్రుల్లో పురుగు పుట్ర వస్తాయని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని తెలిపారు. ఓటు చెరువులో పేదలకు ఇస్తున్న పింఛన్లు రద్దు చేశారని, మున్సిపాలిటీ అప్రూవల్ చేసిన రోడ్డును పెత్తందారులు ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. పాచిపని చేస్తూ బతుకు జీవనం సాగిస్తున్న తమకు పథకాలను రద్దు చేస్తే ఎలా బతకాలని వారు ప్రశ్నించారు. మూడో రోజు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, పట్టణ కార్యదర్శి సురేంద్రన్, సీనియర్ నాయకులు చల్లా వెంకటయ్య, చైతన్య పాల్గొన్నారు. ప్రజలనుంచి అందిన ఫిర్యాదులపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ, తహశీల్దార్ కార్యాలయాల ఎదుట, కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేయనున్నట్లు వాడా గంగరాజు తెలిపారు. ఉద్యమాలకు జనం కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.










