అనంతపురం కార్పొరేషన్ : నగరంలో ఇంటింటి చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించొద్దని నగర మేయర్ మహమ్మద్ వసీం సిబ్బందికి సూచించారు. నగరంలోని 48వ డివిజన్‌లో గురువారం మేయర్ మహమ్మద్ వసీం పర్యటించి, స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లాప్ కార్యక్రమాన్ని నగరంలో పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేపట్టాలని ఆ దిశగా సిబ్బంది సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా అవగాహన కల్పించాలని అధికారులకు తెలియజేశారు. అనంతరం రెండో రోడ్‌లోని మిత్రా హోటల్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న రోప్‌లైట్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు శ్రీనివాసులు, శేఖర్‌బాబు, టివి.చంద్రమోహన్ రెడ్డి, ఎంహెచ్‌ఒ గంగాధర్ రెడ్డి, వైసిపి నాయకుడు ఖాజా పాల్గొన్నారు.










