
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్‌కు 73 సెంట్లను ప్రభుత్వం కేటాయించిందని మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు తెలిపారు. నగరంలోని పెద్ద రెల్లివీధిలోని భవనంలో మాజీ సైనికుల సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికులకు, వీర మాతలకు మెడికవర్ ఆస్పత్రిలో ఇసిహెచ్‌ఎస్ ఎన్‌ప్యానల్‌మెంటు అయిందన్నారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎ.శైలజ మాట్లాడుతూ భవనానికి కావాల్సిన తొలివిడత నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. జిల్లాలో అమర జవాను స్మారక స్థానం అన్ని మండల యూనియన్ల సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతినెలా సైన్యం నుంచి ఉద్యోగ విరమణ పొందుతున్న సైనికులను సత్కరించి, వారిని ఫెడరేషన్‌లోకి ఆహ్వానిస్తామని జిల్లా మాజీ సైనికుల సమాఖ్య ఉపాధ్యక్షుడు వి.సూర్యనారాయణ తెలిపారు. సమావేశంలో మాజీ సైనికుల సమాఖ్య ట్రెజరర్ ఐ.ఢిిల్లేశ్వరరావు, జిల్లా మాజీ సైనికుల సమాఖ్య చైర్మన్ పి.ఈశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ వి.సూర్యనారాయణ, జాయింట్ సెక్రటరీ పి.మురళీధరరావు, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎ.వి జగన్మోహనరావు, కరస్పాండెంట్ టి.జనార్థనరావు తదితరులు పాల్గొన్నారు.