Jun 16,2023 21:58

స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ గౌతమి

           ప్రజాశక్తి-పెద్దపప్పూరు    'గ్రామంలో ఎక్కడ చూసినా ఊటనీరు దర్శనమిస్తోంది.. దీంతో విషజ్వరాలు ప్రబలడంతోపాటు ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయి..' అంటూ మండల పరిధిలోని పెద్దయక్కలూరు ఎస్సీకాలనీవాసులు కలెక్టర్‌ గౌతమి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిధిలోని చాగల్లు ప్రాజెక్టు కింద ఉన్న పెద్దయక్కలూరు గ్రామాన్ని కలెక్టర్‌ సందర్శించారు. దాదాపు 12 ఏళ్లుగా పెద్దయక్కులూరు ఎస్సీ కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఊటనీటితోపాటు పలు సమస్యలను ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వినతికి స్పందించిన కల్టెర్‌ ముందుగా చాగల్లు ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వల్ల ముం పునకు గురైన గ్రామాల వివరాలు తెలుసుకుని పెద్దయ కులూరు గ్రామంలో పర్యటించారు. ఎస్సీ కాలనీ అంతా కలి య తిరిగి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీవాసులు పలు సమస్యలపై కలెక్టర్‌ ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు. చాగల్లు రిజర్వాయర్‌ నిర్మించినప్పటి నుంచి కాలనీలో విపరీతంగా ఊటనీరు వస్తోందన్నారు. ఆఖరికి మరుగుదొడ్లలో కూడా నీరు వస్తోందని వాపోయారు. ఫలితంగా డెంగ్యూలాంటి విషజ్వరాల బారిన పడుతున్నామన్నారు. అంతేగాకుండా ఇళ్లల్లోకి పాములు, తేళ్లు వస్తుండటండో రోజూ దినదినగం డంగా గడుపుతున్నామన్నారు. మరుగుదొడ్లలో ఊటనీరు వస్తుండటంతో ఆడ, మగ తేడా లేకుండా ఆరుబయలకు వెళ్లాల్సి వస్తోందని మహిళలు కన్నీటిపర్యవంతమయ్యారు. ఆఖరికి ఎవరైనా చనిపోతే ఖననం చేయాలన్నా ఆడుగు తీస్తే నీరు వస్తోందన్నారు. చేసేదిలేక నీళ్లలోనే పూడుస్తున్నామని వాపోయారు. ఇందుకు స్పందించిన కలెక్టర్‌ ఈసారి బాగా వర్షాలు కురవడం వల్ల చాగల్లు ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉందన్నారు. దీంతో పలు గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా పెద్దయక్కలూరు ఎస్సీ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఇందులో భాగంగానే గ్రామం మొత్తం కలియతిరిగి సమస్యలను గుర్తించామన్నారు. ఇక్కడి వాసుల జీవనం మరీ దారణంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ముఖ్యంగా డ్రెయినేజీ నీటిలా ఊటనీరు వస్తుండటంతో గాలి కూడా కలుషితం అవుతోందన్నారు. ఇక పోలాల్లో జమ్ము పెరగడంతో కొన్ని పొలాలను నిరుపయోగంగా వదిలేసినట్లు గుర్తించామన్నారు. ఆయా సమస్యలపై ప్రభుత్వానికి పనులు నివేదికలు పంపుతామన్నారు. అంతేగాకుండా మరోసారి తమ టెక్నికల్‌ టీంతో పరిశీలించి గ్రామస్తులు కోరుతున్నట్లుగా పూర్తిగా గ్రామాన్ని మార్చడమా.. లేక పర్యాయ మార్గం ఏమైనా ఉందా అని తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. ఏదిఏమైనా పెద్దయక్కలూరు ఎస్సీకాలనీ వాసుల సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్‌, తహశీల్దార్‌ లక్ష్మీనాయక్‌, ఎంపిడిఒ రామకృష్ణ, రవిప్రసాద్‌రెడ్డి, జడ్పిటిసి రమాదేవి, గ్రామస్తులు శంకర్‌రెడ్డి, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.