Sep 19,2023 22:28

ఇళ్ల స్థలాలు ఇప్పించండి సార్‌..
తగవారిపల్లి గ్రామస్తుల వినతి
ప్రజాశక్తి- బంగారుపాళ్యం :
ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని మండలంలోని తగువారిపల్లి పంచాయతీ గ్రామస్తులు మంగళవారం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ అనిల్‌ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో తగ్గువారిపల్లి పంచాయతీకి సంబంధించి ఇళ్ల స్థలాల అర్హుల జాబితాలో తమ పేర్లు ఉన్నాయని, ఇప్పుడు పంపిణీ చేస్తున్న జాబితాలో తమ పేర్లు లేవని వాపోయారు. అసలైన లబ్ధిదారులను విస్మరించి కొత్త లబ్ధిదారులకు పంపిణీ చేపడుతున్నారని ఆరోపించారు. పంచాయతీలో సొంత ఇంటి కల నెరవేరకుండా ఉన్న లబ్ధిదారులు అధిక సంఖ్యలో ఉన్నారని ఇకనైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అసలైన లబ్ధిదారులను గుర్తించాలని కోరారు.