అనంతపురం కలెక్టరేట్: పేద కార్మికుల వైద్యానికి ఎంతో ఆసరగా ఉంటున్న ఈఎస్‌ఐ ఆసుపత్రులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి వీటిని మరింత బలోపేతం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్ చేశారు. ఈఎస్‌ఐ స్కీంను బలోపేతం చేసి, కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం నాడు అనంతపురంలో నిరసన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి శ్రీకంఠం సర్కిల్ మీదుగా ఈఎస్‌ఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈఎస్‌ఐ కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ సమాజాభివద్ధిలో కీలకంగా ఉన్న కార్మికవర్గం ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులను కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులకు అక్కడ ఏవిధమైన వైద్యసేవలూ అందడం లేదన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా జిల్లా కేంద్రాల్లో ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో 30 పడకలను అందుబాటులో ఉంచాలన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులనూ ఏర్పాటు చేయాలన్నారు. డిస్పెన్సరీలు, డాక్టర్లు, సిబ్బంది, పరికరాలు, మందులు తగినంత స్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. రెఫరల్ ఆసుపత్రుల్లో చందాదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని వైద్యసేవలూ అందజేయాలని డిమాండ్ చేశారు. 10 మంది కార్మికులు లోపల ఉన్న సంస్థల్లో కూడా ఇఎస్‌ఐ పథకాన్ని వర్తింజేయాలన్నారు. రూ.21 వేల వేతన పరిమితి దాటిన కార్మికులను ఇఎస్‌ఐ పథకం నుంచి తొలగించే నిబంధనను తక్షణం రద్దు చేయాలన్నారు. ఇపిఎఫ్ పథకంలో మాదిరే రూ.15 వేల వరకు వేతనం ప్రకారం ఇఎస్‌ఐ పథకానికీ వర్తింప చేయాలన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వేలాది మంది కార్మికులు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వం స్పందించి కార్మిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈఎస్‌ఐ అధికారి మోహన్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వై.వెంకటనారాయణ, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.నాగభూషణం, మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రిస్వామి, తిరుమలేష్, సత్యసాయి శ్రీరామరెడ్డి వాటర్స్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, రాము, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.










