పెద్దవడుగూరు : మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షబీభత్సం సృష్టించింది. రాత్రి 11 గంటల సమయంలో భారీ ఈదురుగాలు వీయడంతో గ్రామాల్లో విద్యుత్ స్తంబాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మిడుతూరు రోడ్డుకు మధ్యలో చెట్టు కూలిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మండల వ్యాప్తంగా 45 విద్యుత్ స్తంబాలు కూలినట్లు ట్రాన్స్‌కో ఎఇ షఫీవుద్దీన్ తెలిపారు. అలాగే కాశేపల్లి, కొత్తపల్లి, విరుపాపురం, చిత్రచేడు, చింతలచెరువు తదితర గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న ఉద్యానశాఖ అధికారిణి మిత్ర, ఎఇఒ కైలాస్, తదితరులు శనివారం ఉదయం దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మండలవ్యాప్తంగా 43ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
గుత్తి : పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కురిసిన ఈదుర గాలులతో కూడిన వర్షానికి వివిధ గ్రామాల్లో మామిడికాయలు నేలరాలాయి. ధర్మాపురం గ్రామంలో రైతు కష్ణారావు 4.5 ఎకరాల్లో సాగు చేసిన 320 మామిడి చెట్లకు మామిడికాయలు రాలిపోయాయి. దీంతో సుమారు రూ.2 లక్షలు నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే కరిడికొండ గ్రామంలో రంగనాయకులు సాగు చేసిన మామిడి చెట్లకు కాయలు రాలిపోవడంతో రూ.3 లక్షలు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఊటకల్లు గ్రామంలో టి.సురేష్, నారాయణ, కోదండరాముడు, నాగప్ప అనే రైతులకు చెందిన మామిడి చెట్ల కాసిన కాయలు వర్షానికి రాలిపోయాయి. రూ.లక్షల్లో నష్టపోయామని వాపోయారు. మామిడి పంట చేతికందే సమయంలో అకాల వర్షాలకి రాలిపోవడంతో తాము ఆర్థికంగా నష్టపోయామని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు.
గుత్తి మండలంలో రాలిన మామిడి కాయలను ఏరుతున్న దృశ్యం










